Betting: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌.. పందేలు తగ్గేదేలే!

ఎటుచూసినా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముచ్చట్లే. క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకునేందుకు కాఫీక్లబ్‌లు, హోటళ్లు భారీ తెరలు ఏర్పాటుచేశాయి.

Updated : 26 May 2024 07:52 IST

హైదరాబాద్‌లో భారీ ఎత్తున బెట్టింగ్స్‌
బేగంబజార్, శివారు ఫామ్‌హౌస్‌లో బుకీల మకాం

ఈనాడు, హైదరాబాద్, అబిడ్స్, న్యూస్‌టుడే: ఎటుచూసినా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముచ్చట్లే. క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకునేందుకు కాఫీక్లబ్‌లు, హోటళ్లు భారీ తెరలు ఏర్పాటుచేశాయి. బెట్టింగ్‌ ముఠాలు రంగంలోకి దిగాయి. వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి పందెపు రాయుళ్లకు సమాచారం చేరవేశాయి. ఆఖరి ఆటను సొమ్ము చేసుకునేందుకు దేశంలోని ప్రధాన బుకీలు నగరంలో మకాం వేసినట్టు సమాచారం. బంజారాహిల్స్, బేగంబజార్, ఘాన్సీబజార్, అబిడ్స్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని ఖరీదైన హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్స్, ఫామ్‌హౌస్‌ల్లోని గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, యాప్‌లు, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా రూ.1000 నుంచి రూ.10లక్షల వరకూ పందేలు ఆహ్వానిస్తున్నారు. కేపీహెచ్‌బీకాలనీ సమీపంలో కొందరు బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండటాన్ని స్థానికులు గుర్తించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారంతా దుకాణం సర్దుకున్నారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. పోలీసులు గట్టి నిఘా ఉంచారు. బుకీలు, స్థావరాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

యువత విలవిల

చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. లోన్‌యాప్‌లతో అప్పులు.. రెట్టింపు లాభాలంటూ యాప్‌ల్లో ప్రకటనలు. ఇవన్నీ యువతను ఆకర్షిస్తున్నాయి. నగరంలో ఐపీఎల్‌ సీజన్‌లో రూ.500కోట్లమేర పందెపు సొమ్ములు చేతులు మారుతుంటాయని అంచనా. వీటిలో కేవలం 5-10శాతం మాత్రమే పట్టుబడుతున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా పందేలు జరగటంతో నిఘావర్గాలు గుర్తించలేకపోతున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున రూ.2.5కోట్లు పందెం కాశానంటూ అంతర్జాతీయ గాయకుడు ప్రకటించడం ఏస్థాయిలో బెట్టింగ్‌ సాగుతుందనేందుకు నిదర్శనం. నగరంలో ఎంతోమంది యువకులు, ఉద్యోగులు పందేలకు బానిసలుగా మారారు. రూ.లక్షల్లో అప్పులు చేసి తీర్చలేక బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని