Bhadrachalam: భద్రాచలం రామాలయం భూముల్లో ఆగని వివాదం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భూమిలో ఆక్రమణల నేపథ్యంలో ఏర్పడిన వివాదం కొనసాగుతోంది. ఆది, సోమవారాల్లో ఆలయ సిబ్బంది, పురుషోత్తపట్నం గ్రామస్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

Published : 24 Oct 2023 13:59 IST

దేవస్థానం భూమిని అప్పగించాలని నినాదాలు చేస్తున్న రామాలయం ఈవో, సిబ్బంది (పాతచిత్రం)

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భూమిలో ఆక్రమణల నేపథ్యంలో ఏర్పడిన వివాదం కొనసాగుతోంది. ఆది, సోమవారాల్లో ఆలయ సిబ్బంది, పురుషోత్తపట్నం గ్రామస్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజుజిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం పరిధిలో దాదాపు 886 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఎక్కువ భాగం ఆక్రమణలకు గురైంది. ఇది రామాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని వంద ఎకరాల్లో గోశాలలను నిర్మిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గోశాలలకు చుట్టుపక్కల ఆక్రమణలకు గురైందంటూ దాదాపు 20 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ఆదివారం రామాలయం ఈవో రమాదేవి నేతృత్వంలో అర్చకులు, ఉద్యోగులు వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆక్రమిత భూమిలో కొంత మేర జామాయిల్‌ను రైతులు సాగు చేస్తున్నారు. ఈ జామాయిల్‌ తోటను మిషన్ల సాయంతో రామాలయం సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. దీన్ని పురుషోత్తపట్నం గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో కొంతమందికి గాయాలయ్యాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఆదివారం రాత్రి వరకు గందరగోళ పరిస్థితి నెలకొంది. సోమవారం ఉదయం పురుషోత్తపట్నానికి చెందిన కొంతమంది వ్యక్తులు దేవస్థానం భూముల్లో ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న రామాలయం అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. దేవుడి భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని చెబుతూ ఆలయ సిబ్బంది ఆ పనులను అడ్డకునే ప్రయత్నం చేశారు. ఇది దేవుడి భూమి కాదని తమకే సర్వహక్కులు ఉన్నాయని పురుషోత్తపట్నం వాసులు బదులిచ్చారు. కోర్టుల తీర్పులతోపాటు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సు ప్రకారం ఈ భూములన్నీ రాముడికే చెందుతాయని ఈవో రమాదేవి తేల్చి చెప్పారు. 

ఈ విషయమై సోమవారం మళ్లీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడికి వెళ్లిన మీడియ సిబ్బంది వద్ద ఉన్న సెల్‌ఫోన్లను పురుషోత్తపట్నం వాసులు లాక్కున్నారు. అక్కడే ఉన్న ఏఈవో భవానీ రామకృష్ణారావుపై దాడి చేశారు. ఎటపాక రెవెన్యూ, పోలీసులు అధికారులు రామాలయం దేవస్థానం అధికారులకు సహకరించలేదని ఆరోపించారు. ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో ఈవో నేతృత్వంలో అర్చకులు, సిబ్బంది ఎటపాక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దేవస్థానం భూముల్లో ఆక్రమణలను తొలగించి ఆ భూములను అప్పగించాలని కోరారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై మంగళవారం పురుషోత్తపట్నం రైతులు ప్రత్యేకంగా సమావేశమై ఆ భూమి పురుషోత్తపట్నం వాసులదేనని తెలిపారు. రామాలయం అధికారులు అకారణంగా తమ భూముల్లోకి వచ్చి పంటలను నాశనం చేశారని ఆరోపించారు. న్యాయస్థానం ఏది చెబితే దానికి కట్టుబడి ఉంటామని.. దీన్ని గుర్తించి న్యాయం చేయాలని వీడియో సందేశాన్ని వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు. కాగా పురుషోత్తపట్నం భూములపై 260కి పైగా తీర్పులు రామాలయానికి అనుకూలంగా ఉన్నాయని ఈవో రమాదేవి చెప్పారు. యాజమాన్య హక్కులు, పట్టాపాసుపుస్తకాలు, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పేరుపై ఉన్నాయని పేర్కొంటూ ఈవో రమాదేవి వాట్సప్‌ గ్రూపుల్లో వీడియో పోస్టు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని