ఆ దేశాల్లో బిడ్డ పుట్టగానే..!

వివాహిత జంట తల్లిదండ్రులుగా మారడం అనేది జీవితంలో ఒక మధురమైన ఘట్టం. స్త్రీ.. ఒక బిడ్డను తొమ్మిది నెలలు కడుపులో మోసి జన్మనిస్తుంది. బిడ్డ భూమిపైకి వచ్చిన క్షణం వారి కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి. అయితే, పురుడు సమయంలో, పురుడు

Updated : 29 Mar 2021 05:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాహిత జంట తల్లిదండ్రులుగా మారడం అనేది జీవితంలో ఒక మధుర ఘట్టం. ఆ క్షణం వారి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే, పురుడు సమయంలో, పురుడు జరిగిన తర్వాత ఒక్కోచోట ఒక్కో విధమైన ఆచారాల్ని పాటిస్తుంటారు. ఆధునిక కాలంలో ఈ ఆచారాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. అయినా ఇప్పటికీ పలుచోట్ల కొనసాగుతున్నాయి. మరి వివిధ దేశాల్లో ప్రజలు పాటిస్తున్న భిన్నమైన ఆచారాలేంటో చూద్దామా..?

జరాయువు ఖననం

ఇండోనేషియాలోని బాలి ఐలాండ్‌లో ప్రజలు ప్రాచీనకాలం నాటి ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా బిడ్డకు జన్మనిస్తే తల్లి నుంచి బిడ్డకు అనుసంధానంగా ఉండే జరాయువును కత్తిరించి భూమిలో ఖననం చేస్తారు. ఈ జరాయువును జీవిగానే భావించి.. పుట్టిన బిడ్డ కవలపిల్లాడనుకుంటారు. అందుకే దీన్ని బాగా శుభ్రం చేసి, ఒక డబ్బాలో పెట్టి.. ఇంటి ఆవరణలో ఖననం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, బంధువులను పిలిచి వారి సమక్షంలో నిర్వహిస్తారు. ఆఫ్రికాలోని నైజీరియా, ఘనా వంటి దేశాల్లోనూ ఈ ఆచారం ఉంది.

షరబత్‌ తాగాల్సిందే

బిడ్డ పుట్టిన సంతోషంలో కుటుంబ సభ్యులు, బంధువులు విందు చేసుకోవడం, శీతలపానీయాలు తాగడం సాధరణమే. కానీ, టర్కీలో బిడ్డ పుట్టిన వెంటనే తల్లి షరబత్‌ తాగడం అక్కడి ఆచారమట. నిమ్మరసం, చక్కెర, ఎరుపు రంగు కలిపిన షరబత్‌ను ఆస్పత్రిలోనే తాగిస్తారు. ఆ తర్వాత బిడ్డను చూసేందుకు వచ్చే బంధువులందరికీ ఈ షరబత్‌నే ఇస్తారట.

నొప్పికి అరవొద్దు

పురుడు సమయంలో మహిళలు నొప్పులు భరించలేక అరుస్తుంటారు. కానీ, ఆఫ్రికా ఖండంలోని టోగో దేశంలో స్త్రీలు పురుడు సమయంలో అరవకూడదట. అక్కడి ప్రజలు దుష్ట శక్తులుంటాయని నమ్ముతారు. మహిళలు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అరిస్తే.. ఆ అరుపులు దుష్టశక్తుల్ని ఆకర్షిస్తాయట. అందుకే వీలైనంత వరకు అరవకుండా ఉండేలా చూస్తారట.

బిడ్డ అంద విహీనంగా ఉండని ప్రచారం

బల్గేరియాలో బిడ్డ పుట్టడాన్ని దురదృష్టంగా భావిస్తున్నట్లు నటిస్తారు. శిశువు ఎంత అందంగా ఉన్నా.. అందవిహీనంగా ఉన్నాడంటూ ప్రచారం చేస్తారు. ఎందుకంటే బిడ్డ పుట్టాడని సంబరాలు జరుపుకొంటే దుష్టశక్తులు బిడ్డకు కీడు చేస్తాయని బల్గేరియా ప్రజలు నమ్ముతారు. అందుకే ఆ విధంగా చేస్తుంటారు.

జరాయువును దాచుకుంటారు

జపాన్‌లో మహిళలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆస్పత్రి వైద్యులను అడిగి జరాయువులోని కొంత భాగాన్ని ఇంటికి తీసుకెళ్తారు. దాన్ని బాగా శుభ్రం చేసి.. ఎండబెడతారు. ఆ తర్వాత ఎండిపోయిన జరాయువును ఒక డబ్బాలో పెట్టి ఇంట్లో భద్రపరుస్తారు. ఇలా ఎందుకు చేస్తారో స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, భవిష్యత్తులో బిడ్డ అనారోగ్యానికి గురయితే ఈ జరాయువుతో ఔషధం తయారు చేస్తారని, తల్లి మృతి చెందితే ఆమెకు తోడుగా ఈ జరాయువును ఉంచి అంత్యక్రియలు చేస్తారని వాదనలు వినిపిస్తుంటాయి.

పుట్టిన మూడో రోజే వేడుక

టిబెట్‌ ప్రజలు బిడ్డ పుట్టిన వెంటనే ఇంటి బయట రెండు బ్యానర్లు కడతారు. ఒక బ్యానర్‌ను దుష్టశక్తులు తాకకుండా బిడ్డను కాపాడాలని ప్రార్థిస్తూ.. మరో బ్యానర్‌ను అదృష్టాన్ని ప్రసాదించాని దేవుణ్ణి కోరుకుంటూ కడతారు. అంతేకాదు, బిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులు వేడుకలు జరుపుకోరు. మూడో రోజు సంబరాలు చేసుకుంటారు.

బిడ్డ నవ్వినప్పుడే సంబరాలు

యూఎస్‌లోని ఆరిజోనా, న్యూమెక్సికో వంటి ప్రాంతాల్లో ఉండే నవాజో తెగ ప్రజలు పుట్టిన బిడ్డ నవ్వినప్పుడే సంబరాలు జరుపుకొంటారు. ఎందుకంటే శిశువు ఎప్పుడైతే నవ్వుతాడో అప్పుడే ఆధ్యాత్మిక లోకం నుంచి భూలోకంలోకి వస్తాడని అక్కడి వారి నమ్మకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని