MLC kavitha: తిహాడ్‌ జైలులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి

దిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Updated : 05 Apr 2024 16:18 IST

దిల్లీ: దిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేయగా.. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా కవిత తిహాడ్‌ జైలులో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. అలాగే, విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే.

కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  గతంలో తాము నమోదు చేసిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారినవాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. కవితను ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టిన తర్వాత సీబీఐ ఈ కేసులో మరో ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.

దిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయని, మద్యం విధానం రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు లబ్దిచేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ తొలుత కేసు నమోదు చేసింది. ఇప్పటికే కవితను సీబీఐ విచారించగా.. గత నెల 15న ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. పది రోజుల పాటు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా మరోసారి కవితను ప్రశ్నించేందుకు ప్రత్యేక పిటిషన్‌ వేసి అనుమతి తీసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని