ఫిల్మ్‌సిటీలో రామోజీరావు పార్థివదేహం.. ప్రముఖుల నివాళి

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించారు.

Updated : 08 Jun 2024 11:15 IST

హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత, సినీ ప్రముఖులు రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, రాజేంద్రప్రసాద్‌,  ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తదితరులు నివాళులర్పించారు. రామోజీరావు పార్థివదేహాన్ని చూసి రాజేంద్రప్రసాద్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రామోజీ గ్రూప్‌ సంస్థల సిబ్బంది తమ ఛైర్మన్‌కు కడసారి నివాళులు అర్పిస్తున్నారు.

రామోజీకి భారతరత్న సముచిత గౌరవం: రాజమౌళి

‘‘ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. మరెంతో మందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచితమని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ దర్శకుడు రాజమౌళి

తెలుగు భాషకు ఆయన ఎనలేని సేవ చేశారు: జానారెడ్డి

‘‘రామోజీరావు మరణం పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. 1983 నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. పత్రికాధినేతగా, వ్యాపారవేత్తగా కీర్తిగడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్‌సిటీ నిర్మించారు. తెలుగు భాషకు ఆయన ఎనలేని సేవలు చేశారు. వ్యవసాయంపై మక్కువతో అన్నదాత తీసుకొచ్చి రైతులకు ఎంతో సాయపడ్డారు’’-జానారెడ్డి

ఆయనతో మాట్లాడితే ఎంతో ఎనర్జీ వచ్చేది: నరేశ్‌

‘‘శ్రీవారికి ప్రేమలేఖ’ నుంచి ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. నాకు మానసికంగా నాలుగు స్తంభాలు.. అమ్మ, కృష్ణగారు, జంధ్యాలగారు, రామోజీరావుగారు. నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనతో మాట్లాడితే ఎక్కడలేని శక్తి వచ్చేది. ప్రపంచ సినిమా ఇక్కడకు తీసుకురావాలని రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మించారు. ఇండియాలో యూనివర్సల్‌ స్టూడియో నిర్మించిన గొప్ప వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - సినీ నటుడు నరేష్‌

నాలాంటి ఎంతో మంది నటులను పరిచయం చేశారు: కల్యాణ్‌రామ్‌

‘‘తొలి చూపులోనే’ సినిమాతోనే నా సినీ ప్రస్థానం మొదలైంది. నాలాగే ఎంతో మంది సినీతారలకు అవకాశం ఇచ్చారు. టెలివిజన్‌లోనూ రచయితలు, నటులను పరిచయం చేశారు. ఈనాడు, ఈటీవీల ద్వారా నమ్మకమైన వార్తలను అందించిన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీకి రామోజీ ఫిల్మ్‌ సిటీ గొప్ప ఆస్తి. ఏ షూటింగ్‌ అయినా సులభంగా ఇక్కడ జరిగిపోతుంది. ఆయన మరణం కలచివేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’-నందమూరి కల్యాణ్‌రామ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు