Hyderabad News: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 2 స్కైవేల నిర్మాణానికి లైన్‌ క్లియర్‌

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 2 స్కైవేల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 

Published : 01 Mar 2024 22:15 IST

సికింద్రాబాద్‌లోని రక్షణశాఖ భూముల్లో రెండు స్కైవేల నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది. హైదరాబాద్‌- కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి, హైదరాబాద్‌ -నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్లకు కేంద్ర రక్షణశాఖ అనుమతిచ్చింది. జూబ్లీబస్‌ స్టేషన్‌ నుంచి హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వరకు 11.30 కిలోమీటర్ల మేర ఆరులేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం 83 ఎకరాలు కేటాయించాలని కేంద్రాన్ని 2018లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 

హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయరహదారిపై ప్యారడైజ్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు జంక్షన్‌ వరకు నాలుగు చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్‌లతో 18.30 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌తో పాటు పైనుంచి మెట్రో వెళ్లేలా మొత్తం 56 ఎకరాలు కోరారు. పెండింగ్‌లో ఉన్న రక్షణశాఖ భూముల బదిలీని త్వరగా చేయాలని జనవరి 5న సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. దీంతో స్కైవేల నిర్మాణం కోసం భూములు బదిలీ చేస్తూ శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం అనుమతి ఇవ్వడంతో త్వరలోనే స్కైవేలు నిర్మిస్తామని, దానివల్ల ఒకవైపు నిజామాబాద్, ఆదిలాబాద్.. మరోవైపు కరీంనగర్, రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తొలిగిపోనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని