Andhra news: పిన్నెల్లిని త్వరలోనే అరెస్టు చేసి తీరుతాం: సీఈవో ఎంకే మీనా

ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చినట్టు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

Updated : 23 May 2024 15:44 IST

అమరావతి: మాచర్ల (Macherla) నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చినట్టు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరెస్టు విషయంలో ఈసీ సీరియస్‌గా ఉందని,  త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు తెదేపా నేతలు వెళ్లటం ఇప్పుడు మంచిది కాదని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయన్నారు. పరామర్శలకు ఈ సమయంలో వెళ్లొద్దని రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. 

‘‘బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లకూడదు, ఎవరినీ ఆ గ్రామాలకు వెళ్లనీయొద్దని సూచనలు జారీ చేశాం. పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు. దర్యాప్తు సమయంలో ఎక్కడో.. ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లాయి. ఈనెల 25 నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటిస్తా’’ అని ఎంకే మీనా తెలిపారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ట  ఏర్పాట్లు..

జూన్‌ 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ట మైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలను కచ్చితత్వంతో త్వరితగతిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఎన్ని టేబుళ్లు, ఎన్ని రౌండ్ల లెక్కింపు అనే విషయాలను తెలియజేయాలని సూచించారు.

‘‘కౌంటింగ్‌ కేంద్రాల వద్ద  ప్రత్యేక మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలి. కౌంటింగ్‌ సంబంధిత వివరాలను అభ్యర్థులు, ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలి. స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంల తరలింపు మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలి. బారికేడ్లు, సూచికలను కూడా ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ, పార్లమెంట్‌కు వేర్వేరుగా పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలి. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కించాకే, ఈవీఎంల లెక్కింపు మొదలు కావాలి. ఈసీ నిర్వహించే ఎన్‌కోర్‌ వెబ్‌ అప్లికేషన్‌లో ఫలితాలను వెంటనే అప్‌లోడ్‌ చేయాలి. అనధికార వ్యక్తులు, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్‌ కేంద్రాలకు అనుమతించొద్దు. లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతుంది’’ అని మీనా స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని