Chandrababu: రామోజీరావు స్ఫూర్తితో ఆంధ్రపదేశ్‌ను అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

తెలుగు జాతికి గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి రామోజీరావు అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు.

Published : 09 Jun 2024 00:48 IST

హైదరాబాద్‌: తెలుగు జాతికి గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి రామోజీరావు అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘రామోజీరావు మృతి చాలా బాధాకరం. ఒక యుగపురుషుడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. అనునిత్యం సమాజహితం కోసం, తెలుగుజాతి కోసం పనిచేశారు. ఒక పల్లెటూరులో సాధారణ కుటుంబంలో పుట్టి.. అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. ఆయన వ్యక్తి కాదు .. ఒక వ్యవస్థ. మార్గదర్శితో ప్రారంభించి ఆ తర్వాత ఈనాడు, ఈటీవీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు స్థాపించారు. నిద్రలేస్తే ఈనాడు పత్రిక చదివితే తప్ప ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు.  ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేసేందుకు అనునిత్యం సాధన చేశారు. 40 ఏళ్లుగా నాకు ఆయనతో పరిచయం ఉంది. నాతో ఒక్కటే చెప్పే వారు మీరు ఏం చెప్పినా .. నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని స్పష్టంగా చెప్పేవారు. ఆయన చనిపోయే వరకు ఒకటే కోరిక.. అనునిత్యం పనిచేస్తూ.. పనిలో చనిపోతేనే ఆనందంగా ఉంటుందనేవారు. బ్రతికున్నంతవరకు ప్రతి నిమిషం ప్రజలకోసమే పనిచేస్తూ ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావుగారు.

ఆయన నిర్మించిన వ్యవస్థలు ఈనాడు, ఈటీవీ శాశ్వతం. వీటితో పాటు చిత్రపరిశ్రమకు ఎనలేని సేవలందించారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మించారు. నా వల్ల ఈ సిటీకి, రాష్ట్రానికి ఆదాయం రావాలని చెప్పేవారు. తెలుగు జాతి వెలుగు.. తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధనిపిస్తోంది. ఎంతో విశ్వసనీయత కలగిన వ్యక్తి రామోజీరావు. నాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ఎంతో ధైర్యం చెప్పే వారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన ధర్మం పక్షానే ఉండి పనిచేశారు. ప్రజలకు కూడా ఆయనపై అచంచలమైన విశ్వాసం. అందుకు కారణం జీవితాంతం ఆయన సంపాదించిన విశ్వసనీయత. అలాంటి వ్యక్తిని పొగొట్టుకోవడం బాధేస్తోంది. ప్రతి ఒక్కరూ రామోజీరావును ఆరాధిస్తారు. ఆయన చెప్పిన విషయాలు ఎప్పుడూ నా చెవుల్లో రింగుమంటూనే ఉంటాయి. రామోజీరావుగారు ఇచ్చిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని