వయసులో చిన్నదయినా.. పెద్ద సాయం చేస్తోంది!

ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యేందుకు స్మార్ట్‌ఫోన్‌ లేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని..!..... ఆన్‌లైన్‌ తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..!

Updated : 12 Oct 2020 12:00 IST


(ఫొటో: హెల్ప్‌చెన్నై ఇన్‌స్టా)

ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యేందుకు స్మార్ట్‌ఫోన్‌ లేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని..!

ఆన్‌లైన్‌ తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..!

పిల్లల ఆన్‌లైన్‌ తరగతుల కోసం పోషణాధారమైన ఆవును అమ్మిన తండ్రి..!!

ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమైన తర్వాత వివిధ పత్రికల్లో వచ్చిన హెడ్‌లైన్స్‌ ఇవీ. ఆన్‌‌లైన్‌ తరగతుల ద్వారా పాఠాల బోధన ఆలోచన బాగానే ఉన్నా.. ఆ పాఠాలు వినడానికి పేద విద్యార్థులు నోచుకోవట్లేదు. ఈ-తరగతులు వినాలంటే స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ లేదా ట్యాబ్‌ తప్పనిసరి. అవి కొనాలంటే వేల రూపాయలు వెచ్చించాలి. కూలి పనులు చేసుకునేవారు, అల్పాదాయ వర్గాలు వీటిని కొని పిల్లలను చదివించే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు తరగతులకు హాజరు కాలేమనే బెంగతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎంతో మంది దాతలు ఇలాంటి విద్యార్థులకు సాయం చేయాలని భావిస్తున్నా.. వారిని ఎలా గుర్తించాలో తెలియట్లేదు. ఈ సమస్యకు ఇంటర్‌ చదివే ఓ విద్యార్థిని పరిష్కారం చూపింది. ఓ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి స్మార్ట్‌ఫోన్‌/ట్యాబ్‌ అవసరం ఉన్న విద్యార్థులను, వాటిని విరాళంగా ఇచ్చే దాతలను కలుపుతూ ఓ వారధిగా నిలుస్తోంది. పేద విద్యార్థులకు.. డిజిటల్‌ పాఠాలకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చేస్తోంది.

కరోనా కారణంగా విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ తరగతులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు ఇంటి వద్దే ఉండి స్మార్ట్‌ఫోన్‌/ల్యాప్‌టాప్‌/ట్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. చెన్నైకి చెందిన గునీషా అగర్వాల్‌ కూడా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఆన్‌లైన్‌ ద్వారానే చదువుతోంది. ఆమెది కాస్త ఉన్నత కుటుంబమే కావడంతో డిజిటల్‌ తరగతులకు హాజరవ్వడంలో ఇబ్బంది పడలేదు. కానీ, వాళ్ల ఇంట్లో పని చేసే వ్యక్తి కుమార్తె ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేందుకు స్మార్ట్‌ఫోన్‌ లేక ఇబ్బంది పడుతుండటంతో గునీషా తల్లి తన పాత ల్యాప్‌టాప్ ఇచ్చారు. ఆన్‌లైన్‌ తరగతులకు ఉపయోగపడుతుందని ఉంచుకోవాలని సూచించారు. దీంతో గునీషా మదిలో ఒక ఆలోచన మెదిలింది. ఇలా స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్‌ లేని పేద విద్యార్థులకు దాతలు పాతవో, కొత్తవో ఇస్తే బాగుంటుంది కదా అనుకుంది. వెంటనే తన ఆలోచనని ఆచరణలో పెట్టి హెల్ప్‌ చెన్నై (www.helpchennai.org) పేరుతో ఒక వెబ్‌సైట్‌ రూపొందించింది. 

ఈ వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్‌ లేని విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. పేద విద్యార్థులకు సాయం చేయాలనుకునే దాతలు ఈ వెబ్‌సైట్‌లోనే వివరాలు నమోదు చేసుకుంటే అవసరాల్లో ఉన్న విద్యార్థుల వివరాలు తెలుస్తాయి. దాతలు స్వయంగా వెళ్లి విద్యార్థులకు అవసరమైన స్మార్ట్‌ఫోన్లు ఇవ్వొచ్చు. లేదా గునీషాకు పంపిస్తే ఆమె విద్యార్థులకు అందజేస్తుంది. ఇప్పటికే గునీషాకు దాతలు 25కి పైగా డివైజ్‌లు పంపగా వాటిలో కొన్నింటిని ఇప్పటికే పేద విద్యార్థులకు పంపిణీ చేసింది. ప్రస్తుతం 15 మంది విద్యార్థులు తమకు సాయం కావాలని వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నారట. వారికీ సాయం చేసేందుకు గునీషా సిద్ధమవుతోంది. ఇంటర్‌ చదువుకుంటున్న ఒక టీనేజీ అమ్మాయి.. పేద విద్యార్థులకు సాయం చేయడం కోసం వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోవడమే కాదు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

మాకు ఆ ఆలోచన రాకపోవడం బాధాకరం: ఐటీ ఉద్యోగి

గునీషా వెబ్‌సైట్‌ ఆలోచన గురించి తెలిసి థింక్‌ఫినిటీ అండ్‌ కన్సల్టింగ్‌ అనే ఓ ఐటీ సంస్థ రూ.50వేల ఖర్చుతో మెరుగైన వెబ్‌సైట్‌ను రూపొందించి ఉచితంగానే ఇచ్చింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా పాత డివైజ్‌లు పనిచేస్తున్నాయో లేదో సరిచూసి మరమ్మతులు ఉంటే చేసి పెట్టేలా వాలంటీర్లను ఆహ్వానిస్తున్నారు. ఈ ఐటీ సంస్థలో పనిచేసే బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గునీషా ఆలోచనను మెచ్చుకున్నారు. ఐటీ వృత్తిలో ఉన్న తమకు ఇలాంటి ఆలోచన రాకపోవడం బాధాకరమన్నారు. కనీసం గునీషా చేపట్టిన ఈ సేవలో తాము భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మార్క్‌ మెట్రో అడ్వర్టైస్‌మెంట్‌ సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.ఆనందకృష్ణ.. గునీషా వెబ్‌సైట్‌కు 100 ట్యాబ్స్‌, రూ. 12లక్షలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే ఎక్కువ మంది విద్యార్థుల అవసరాలు తీర్చొచ్చని చెబుతోంది గునీషా. అలాగే మరేదైనా స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ గునీషా ఎవరో కాదు.. చెన్నై పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ కుమార్‌ అగర్వాల్‌ కుమార్తె కావడం గమనార్హం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని