Andhra Pradesh: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం పరిశీలించారు.

Published : 09 Jun 2024 23:39 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పరిశీలించారు. సీఎస్‌తో పాటు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు సభా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నందున అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేయాలని పాలనా యంత్రాంగానికి సూచించారు. ప్రధాన సభాస్థలి వెనుక భాగంలోని గుంటలను పూడ్చి వీఐపీలు వచ్చేందుకు వీలుగా చదును చేసే పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. వేదిక వద్ద, బారికేడింగ్, బ్లాక్‌ల విభజన పక్కాగా చేయాలని స్పష్టం చేశారు.

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా సభ ప్రాంగణంతో పాటు వెలుపల ఎంపిక చేసిన ప్రదేశాలలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేయాలన్నారు. గన్నవరం జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంక్, ఎన్టీఆర్ ప్రభుత్వ పశు వైద్య కళాశాల, కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలు, ఎలిట్ విస్టాస్, మేధా టవర్స్, ఇతర లేఔట్లలో పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను నిర్మించి, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలీట్ విస్టాస్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులకు పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని