Citizens For Democracy: ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలే శిరోధార్యం: సీఎఫ్‌డీ

ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమాన అవకాశాలు దక్కడమని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఫోరం స్పష్టం చేసింది. పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరింది.

Updated : 12 Apr 2024 19:28 IST

విశాఖపట్నం: ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమాన అవకాశాలు దక్కడమని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఫోరం స్పష్టం చేసింది. పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరింది. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలే శిరోధార్యమని చెప్పారు. 

‘‘ పింఛన్ల పంపిణీ విషయాన్ని పరస్పరం నిందించుకుంటున్నారు. వైకాపాలో కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటించడం లేదు. సీఎఫ్‌డీని విమర్శించడం శోచనీయం. ఈ పద్ధతి మార్చుకోవాలి. ఈ నెలలో పింఛన్ల పంపిణీ ఆలస్యం చేశారు. మే నెల పింఛన్లకు స్పష్టమైన కార్యాచరణ తీసుకోవాలని కోరుతున్నాం. మండుటెండల్లో వృద్ధులను ఇబ్బంది పెట్టడం సరికాదు’’ అని ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.

వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా మాత్రమే ఉంచారని, రాజీనామా చేసిన వారిని మళ్లీ తీసుకుంటామనడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఫోరం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. వాలంటీర్లు బూత్‌లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఈసీకి చెప్పామన్నారు. ‘‘వాలంటీర్లపై మాకు సానుభూతి ఉంది. రద్దు చేయాలని మేం కోరలేదు. వాలంటీర్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటాన్నే మేం వ్యతిరేకిస్తున్నాం. అధికార, ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగ వద్దని వాలంటీర్లను కోరుతున్నాం. వాలంటీర్లను ప్రధాన సమస్యగా సృష్టించడాన్ని సీఎఫ్‌డీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరుతున్నాయి. ఒక్కొక్కరిపై సుమారు రూ.2 లక్షల అప్పు ఉంది. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించాలి. ప్రభుత్వ సలహాదారులు ఏదైనా పార్టీకి ప్రచారం చేయవచ్చా? వాళ్లు గౌరవ వేతనం తీసుకుంటున్నారు. సమయం, సందర్భం మేరకు కచ్చితంగా ఉండాలని సీఈవోను కోరాం’’ అని నిమ్మగడ్డ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని