CM Jagan: సెవెన్‌ స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి జగన్‌ భూమి పూజ

ఏపీలో మూడు చోట్ల సెవెన్‌స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి సీఎం జగన్‌ గండికోటలో భూమి పూజ చేశారు.

Updated : 09 Jul 2023 12:52 IST

గండికోట: వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక స్థలం జమ్మలమడుగు మండలం గండికోటలో ఒబెరాయ్‌ హొటల్‌ నిర్మాణ పనులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. విశాఖ, తిరుపతిలో నిర్మించనున్న ఒబెరాయ్‌ హోటల్స్‌కి కూడా వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్‌ హొటల్స్‌ ఎండీ, సీఈవో విక్రమ్‌ ఒబెరాయ్‌ పాల్గొన్నారు. గండికోటలో ఒబెరాయ్‌ హొటల్స్‌ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధితోపాటు స్థానికులకు కూడా ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. గండికోటకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణం చేపట్టనున్నారు.

జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కాబోతోందని సీఎం జగన్‌ అన్నారు. జులై 15 తర్వాత అన్ని రకాల అనుమతులు వస్తాయన్నారు. గండికోటలో ఒబెరాయ్ సంస్థ గోల్ఫ్‌ కోర్టు పెట్టే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ‘‘రేపు కొప్పర్తిలో డిక్సన్‌ పరిశ్రమ ప్రారంభించబోతున్నాం. ఛానెల్‌ ప్లే, టెక్నో ఇండియా కంపెనీలతో రేపు కడపలో ఎంవోయూ కుదుర్చుకుంటాం’’ అని సీఎం తెలిపారు. శంకుస్థాపన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సీఎస్  జవహర్‌రెడ్డి, పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని