CM Revanth: రైతుల వివరాలు విదేశీ కంపెనీల చేతుల్లో ఎలా పెట్టారు?: రేవంత్‌రెడ్డి

‘ధరణి’ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వీటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు.

Updated : 24 Feb 2024 19:34 IST

హైదరాబాద్‌: ‘ధరణి’ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వీటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారం, కమిటీ గుర్తించిన అంశాలపై శనివారం సచివాలయంలో చర్చించారు. మార్చి మొదటి వారంలోగా 2.45 లక్షల పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలన్నారు. 

2020 ఆర్‌వోఆర్‌ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ తెలిపింది. ‘‘గత ప్రభుత్వం కేవలం 3 నెలల్లోనే సమగ్ర భూ సర్వే చేసింది. హడావుడిగా చేయడం వల్లే కొత్త చిక్కులు వచ్చాయి. పోర్టల్‌లో లోపాలు సవరించాలంటే చట్ట సవరణ లేదా కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం చేయాలి. వివాదాలు లేకుండా భూరికార్డుల ప్రక్షాళన చేయాల్సి ఉంది’’ అని పేర్కొంది. కమిటీ తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.

‘ధరణి’ నిర్వహణ ఏజెన్సీపై విచారణకు ఆదేశం

ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న ఏజెన్సీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. పోర్టల్‌ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. గోప్యంగా ఉండాల్సిన లక్షలాది రైతుల ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు, భూ రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఎలా పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డేటా భద్రంగా ఉన్నట్లేనా? రికార్డులను విదేశీ కంపెనీలకు ఇచ్చే నిబంధనలున్నాయా? అని ప్రశ్నించారు. బిడ్‌ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని