CM Revanth: శిల్పారామం నైట్‌బజార్‌ స్టాళ్లు ఎస్‌హెచ్‌జీలకు కేటాయింపు: సీఎం రేవంత్‌

మాదాపూర్‌ శిల్పారామం వద్ద నైట్‌ బజార్‌లోని స్టాళ్లను స్వయం సహాయక సంఘాలను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Published : 14 Mar 2024 23:40 IST

హైదరాబాద్‌: మాదాపూర్‌ శిల్పారామం వద్ద నైట్‌ బజార్‌లోని స్టాళ్లను స్వయం సహాయక సంఘాలకు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సుమారు ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మహిళ శక్తి పథకంలో భాగంగా ఎస్‌హెచ్‌జీ సభ్యుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు స్టాళ్లను రైతుబజార్ తరహాలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్టాళ్లను పూర్తిగా మహిళలకే కేటాయిస్తూ వీలైనంత త్వరగా జీవోలు జారీ చేయాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని.. అవసరమైతే మణిపుర్‌లో మహిళల మార్కెట్‌ను అధ్యయనం చేయాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

రూ.10 లక్షల ప్రమాద బీమా

స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య ద్వారా బీమా అమలు కానుంది. ప్రముఖ బీమా సంస్థ ద్వారా తక్కువ ప్రీమియంతో అమలు చేయాలని స్త్రీనిధి ఫెడరేషన్‌కు ప్రభుత్వం సూచించింది. విధివిధానాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణబీమాను కల్పిస్తూ మరో జీవో జారీ చేసింది. రూ.2 లక్షల వరకు రుణాలకు రిస్క్‌ కవరేజ్‌ ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రుణబీమా కూడా స్త్రీనిధి ఫెడరేషన్ ద్వారా అమలు కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని