Revanth Reddy: నిమ్స్‌ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని కాపాడినందుకుగానూ నిమ్స్‌ వైద్యులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.

Updated : 26 May 2024 15:33 IST

హైదరాబాద్‌: ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని కాపాడిన నిమ్స్‌ వైద్యులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా బాణాన్ని తొలగించారని ‘ఎక్స్‌’ వేదికగా కితాబిచ్చారు. ప్రజల్లో నిమ్స్‌పై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారన్నారు. భవిష్యత్‌లో నిమ్స్‌ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలు విలవిల్లాడుతూ నరకయాతన అనుభవించిన సోది నంద (17) అనే గిరిజన గిరిజన యువకుడికి నిమ్స్‌ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే.

ఛత్తీస్‌గఢ్‌కి చెందిన సోదినందకు వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తూ బాణం గుచ్చుకుంది. సరిగ్గా గుండె, ఊపిరితిత్తుల మధ్యలో దిగటంతో బాధితుడిని కుటుంబ సభ్యులు భద్రాచలం ఆస్పత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకి తీసుకువెళ్లారు. అయితే పరిస్థితి విషమించటంతో అక్కడి వైద్యులు హైదరాబాద్‌ నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డా.అమరేశ్వర్‌రావు బృందం దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని