CM Revanth Reddy: కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 12 Mar 2024 19:46 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ‘మహాలక్ష్మి స్వశక్తి మహిళ’ పథకాన్ని సీఎం ప్రారంభించారు.

‘‘మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఏపీలో పార్టీకి తీవ్ర నష్టమని తెలిసినా మనకు రాష్ట్రం ఇచ్చారు. కానీ, కేసీఆర్‌ పదేళ్లపాటు మహిళలు, ఆడబిడ్డలను పట్టించుకోలేదు. అందుకే మహిళల ఉసురు తగిలి ఆయన పదవి పోయింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. కేసీఆర్‌ కుటుంబానికి కడుపుమంటగా ఉంది. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం వద్దంటూ ఆటో డ్రైవర్లతో ధర్నా చేయించారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించే రాజీవ్‌ ఆరోగ్యశ్రీని కేసీఆర్‌ నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పథకాన్ని రూ.10లక్షలకు పెంచాం. కేసీఆర్‌, మోదీ కలిసి రూ.400 ఉన్న గ్యాస్‌ సిలెండర్‌ను రూ.1200 చేశారు. మహిళలకు భారం కావొద్దని మళ్లీ రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తానని కేసీఆర్‌ పదేళ్లు డబ్బా కొట్టారు. పదేళ్లలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా 100 మార్కెట్లు నిర్మించి, వారి ఉత్పత్తుల విక్రయం కోసం స్టాళ్లు ఏర్పాటు చేయిస్తాం.

సీఎం కుర్చీలో పాలమూరు బిడ్డ కూర్చుంటే కొందరికి కడుపు మండుతోంది. మహిళలు గెలిపించిన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని  కేసీఆర్‌, మోదీ కలిసి కుట్రలు చేస్తున్నారు. రైతుల పంటలు కొనని మోదీకి ఎందుకు ఓటు వేయాలి. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మోదీ అన్నారు. ఈ పదేళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారా? తెలంగాణ ఏర్పాటును ఆయన ఎన్నోసార్లు అవమానించారు. సోనియాగాంధీ పార్లమెంట్‌ తలుపులు మూసివేసి తెలంగాణ ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరాలని తలుపులు మూసి బిల్లు పాస్‌ చేయించారు’’ అని సీఎం వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని