CM Revanthreddy: రైతులను మోసం చేస్తే.. ట్రేడ్‌ లైసెన్సులు రద్దు చేస్తాం: రేవంత్‌రెడ్డి

రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. 

Published : 12 Apr 2024 21:24 IST

హైదరాబాద్‌: రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్షించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల.. లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. 

అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉందని వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్న సీఎం.. కర్షకులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మార్కెట్‌ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని