CM Revanth Reddy: హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 25 May 2024 22:37 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.. వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. శనివారం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుకు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను సంస్కరించాలన్నారు.

ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు. ‘‘జూన్‌ 4లోగా పూర్తి ప్రణాళిక సిద్ధం చేయండి. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దు. కోడ్‌ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. ఓపెన్‌ సెల్లార్‌ గుంతల వద్ద బారికేడ్లు ఉండేలా చర్యలు చేపట్టాలి. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా.. పవర్‌ మేనేజ్‌మెంట్‌ సరైన విధంగా ఉండేలా చర్యలు చేపట్టాలి’’ అని సీఎం దిశానిర్దేశం చేశారు.

డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటి వారున్నా ఉపేక్షించొద్దు

గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతి గురించి నార్కోటిక్స్ అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. సరఫరా చైన్‌ బ్రేక్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అసలు వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలని అన్నారు. కేసుల్లో సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నా ఉపేక్షించొద్దన్నారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేయమని చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పని చేసేవారిని ప్రోత్సహించాలని, అందుకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం సమకూరుస్తుందని వెల్లడించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి, ఇతర రాష్ట్రాలకు టీఎస్‌ న్యాబ్‌ ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని