జీవో 46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం: సీఎం రేవంత్‌రెడ్డి

పోలీసుశాఖ నియామకాల్లో వివాదాస్పదంగా మారిన జీవో 46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Updated : 12 Feb 2024 23:46 IST

 

హైదరాబాద్‌: పోలీసుశాఖ నియామకాల్లో వివాదాస్పదంగా మారిన జీవో 46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఇవ్వబోయే నోటిఫికేషన్లకు దీనిని అమలు చేయాలా? లేక రద్దు చేయాలా? అనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. జీవో 46పై ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీసు శాఖలో ఎంపిక పూర్తయిన 15,750 మందికి నియామక పత్రాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని సీఎంకు అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తయినందున ప్రస్తుత దశలో జీవో 46 రద్దు చేయడం కొత్త న్యాయవివాదాలకు తెరదీస్తుందని చెప్పారు. అవసరమైతే భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్లకు దీన్ని రద్దు చేయాలని సూచించారు.

కొన్ని శాఖలకు జిల్లాలవారీగా యూనిట్లు లేకపోవడంతో.. 9 శాఖల్లో జనాభా ప్రాతిపదికన జిల్లాలకు పోస్టులు కేటాయిస్తూ 2022 ఏప్రిల్‌ 4న ప్రభుత్వం జీవో 46ను జారీ చేసింది. దీని ప్రకారం ఉద్యోగాల్లో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే దాదాపు 53శాతం ఉద్యోగాలు, మిగిలిన 27 పోలీసు యూనిట్లన్నింటిలో కలిపి 47శాతం పోస్టులు భర్తీ కానుండటంతో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు శాఖలో మార్చి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. గతేడాది అక్టోబర్ 4 నాటికి 15,750 పోస్టులకు ఎంపిక  ప్రక్రియ పూర్తయింది. దీంతో నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు కూడా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లకుండా హైకోర్టు తీర్పు అమలు చేయడమే మేలని అడ్వకేట్ జనరల్, అదనపు ఏజీ సూచించారు.  మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, TSLPRB ఛైర్మన్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, మక్కన్ సింగ్ ఠాగూర్, ఎమ్మెల్సీ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని