దేశాల్లోనూ దేశాలున్నాయ్‌.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలో అనేక చిన్న చిన్న దేశాలు, రాజ్యాలు ఇష్టంగానో, బలవంతగానో పెద్ద దేశాల్లో కలిసిపోయాయి. అయితే ఇప్పటికీ మూడు దేశాలు మాత్రం.. పెద్ద దేశాల భూభాగంలో ఉంటూనే ప్రత్యేక దేశాలుగా కొనసాగుతున్నాయి.

Updated : 05 Nov 2021 03:37 IST

ప్రపంచంలో ఏడు ఖండాలు, ఆ ఖండాల్లో అనేక దేశాలు, ఆయా దేశాల్లో అనేక రాష్ట్రాలు. దేశాలకు.. రాష్ట్రాలకు ప్రత్యేక ప్రభుత్వాలు, పరిపాలనా వ్యవస్థలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌ ఒకప్పుడు నిజాం రాజ్యంగా ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక హైదరాబాద్‌ను భారత్‌లో కలపడానికి నిజాం అంగీకరించలేదు. హైదరాబాద్‌ భారత భూభాగంలో ఉన్నా ప్రత్యేక దేశంగానే ఉంటుందని తెలిపాడు. దీంతో అప్పటి  ప్రభుత్వం ఆపరేషన్‌ పోలో చేపట్టి భారత్‌లో విలీనం చేసుకుంది. ఇలాగే ప్రపంచంలో అనేక చిన్న చిన్న దేశాలు, రాజ్యాలు ఇష్టంగానో, బలవంతగానో పెద్ద దేశాల్లో కలిసిపోయాయి. అయితే ఇప్పటికీ మూడు దేశాలు మాత్రం.. పెద్ద దేశాల భూభాగంలో ఉంటూనే ప్రత్యేక దేశాలుగా కొనసాగుతున్నాయి. నలువైపులా ఒకే దేశపు సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఆ దేశాలేంటి? వాటి విశేషాలేంటో చూద్దామా?

లెసొతో

దక్షిణాఫ్రికా దేశ భూభాగంలో ఉన్న స్వతంత్ర దేశం లెసొతో. 11,583 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండే ఈ దేశంలో దాదాపు 21లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ రాచరికం-రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగుతోంది. లెసొతో ప్రస్తుత చక్రవర్తి లెట్సీ-III. 1822-1868 మధ్య మొషుషు-I ఈ ప్రాంతానికి తొలి చక్రవర్తిగా ఉన్నారు. మొదట్లో ఈ దేశానికి బసుటోలాండ్‌ అని పేరు. 1884 నుంచి 1966 వరకు ఈ దేశాన్ని ఆంగ్లేయులు పాలించగా.. 1966 అక్టోబర్‌ 4 ఈ దేశానికి స్వాతంత్ర్యం రాగానే బసుటోలాండ్‌ పేరును తీసేసి ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ లెసొతో’గా నామకరణం చేశారు. స్థానిక ప్రజలు ఎక్కువగా సెసొతో భాష మాట్లాడుతారు. ఇక ఈ దేశ రాజధాని మసేరు. ఇక్కడ 95శాతం మంది క్రైస్తవులే. కరెన్సీ విషయానికొస్తే.. లెసొతో లోటి, సౌత్‌ ఆఫ్రికా రాండ్‌ చలామణీలో ఉన్నాయి. 

దక్షిణాఫ్రికాతోనే లెసొతో దేశ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉంది. వ్యవసాయం, మాంసం, గనులు ముఖ్య ఆదాయ వనరులు. ఒక పెద్ద దేశంలో సార్వభౌమాధికారాలు కలిగిన స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోన్న లెసొతోకు ఐక్యరాజ్యసమితి, కామన్‌వెల్త్‌ దేశాలు, ఆఫ్రికన్‌ యూనియన్‌లో సభ్యత్వం ఉండటం విశేషం. ఈ దేశం చదువులో ముందున్నా.. టెక్నాలజీని వినియోగించడంలో కాస్త వెనకబడే ఉంది. దేశ జనాభాలో కేవలం 3.4శాతం మందే ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటిని అధిగమించడం కోసం పలు సంస్థలు కృషి చేస్తున్నాయి.


వాటికన్‌ సిటీ

వాటికన్‌ సిటీ గురించి దాదాపు అందరికీ తెలుసు. కేథలిక్‌ చర్చ్‌లకు సంబంధించిన ప్రధాన చర్చి, మత గురువు పోప్‌ ఉండే ప్రాంతం. యూరప్‌ ఖండంలో ఇటలీలోని రోమ్‌ నగర భూభాగంలో ఉన్న అతి చిన్న దేశమిది. 110 ఎకరాల విస్తీర్ణమున్న ఈ దేశంలో ఉండే జనాభా అటు ఇటుగా వెయ్యిమందే. అందుకే ప్రపంచంలో విస్తీర్ణం, జనాభా పరంగా అతిచిన్న దేశంగా వాటికన్‌ సిటీ నిలుస్తోంది. ఇటలీ, చర్చి‌ వ్యవస్థల మధ్య కుదిరిన లుథెరన్‌ ఒప్పందం వల్ల 1929లో ఈ దేశం ఏర్పడింది. దీని ప్రకారం వాటికన్‌ సిటీపై సర్వాధికారాలు పోప్‌కే ఉంటాయి. దేశ భూభాగం చిన్నది కావటంతో పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలు ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి ప్రజలు కేవలం చర్చికి సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే చేస్తూ ఉంటారు. ఇటలీ ప్రజలు ఈ దేశంలోకి రావడానికి ఎలాంటి వీసా.. పాస్‌పోర్టులు అవసరం లేదు.

వాటికన్‌ సిటీకి గార్డెన్‌ సిటీ అని పేరుంది. ఎందుకంటే దేశంలో సగం భూభాగం (57 ఎకరాలు) తోటలతోనే నిండిపోయి ఉంటుంది. ఈ దేశానికి ఇటలీ సైన్యమే రక్షణ కల్పిస్తోంది. ఇక్కడి మ్యూజియం సందర్శకుల ద్వారా వచ్చే డబ్బు, వాటికన్‌సిటీ స్టాంపులు, నాణేలు, ఆధ్యాత్మిక పుస్తకాలు విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. వాణిజ్యం పరంగా యూరో కరెన్సీ చలామణీ అవుతుంది. ఈ దేశానికి అధికార భాష ఏమీ లేదు. కానీ సాధారణంగా ఇటాలియన్‌లోనే మాట్లాడుతారు.


శాన్‌ మారినో

యూరప్‌లోని ఇటలీలోనే శాన్‌ మారినో స్వతంత్ర దేశంగా ఉంటోంది. కేవలం 24 చదరపు మైళ్ల విస్తీర్ణం ఉన్న ఈ దేశంలో మొత్తం 33.5 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశ రాజధాని శాన్‌మారినో అయినా.. ఎక్కువ మంది ప్రజలు ఉండేది డొగన నగరంలోనే. అత్యధిక జీడీపీ ఉన్న దేశాల జాబితాలో శాన్‌ మారినో ఉండటం గమనార్హం. ఇక్కడ ఎక్కువగా ఇటాలియన్‌, రష్యన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడుతారు. రాజ్యాంగబద్ధ పరిపాలన ఉంటుంది. క్రీస్తుపూర్వమే రబ్‌ ఐలాండ్‌ నుంచి మారినస్‌ అనే వ్యక్తి తన ప్రజలతో ఇక్కడికొచ్చి స్థిరపడ్డాడట. రోమ్‌ చక్రవర్తుల నుంచి 301 సంవత్సరంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగం మాత్రం 1600 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. గతంలో ఈ దేశానికి సొంతంగా ‘సమ్మరినీస్‌ లిరా’ అనే కరెన్సీ ఉండేది. ఇప్పుడు యూరో కరెన్సీతోనే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో భద్రత బలగాల సంఖ్య చాలా తక్కువ. జాతీయ స్థాయిలో రక్షణ అవసరమైనప్పుడు ఇటలీ సైన్యం రంగంలోకి దిగుతుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని