Amaravati: రాజధాని ప్రాంతం నుంచి నిర్మాణ సామగ్రి తరలింపు.. అడ్డుకున్న సీఆర్‌డీఏ

రాజధాని ప్రాంతం నుంచి నిర్మాణ సామగ్రి తరలింపు వ్యవహారంపై ఎట్టకేలకు సీఆర్‌డీఏ స్పందించింది.

Updated : 30 May 2024 18:29 IST

అమరావతి: రాజధాని ప్రాంతం నుంచి నిర్మాణ సామగ్రి తరలింపు వ్యవహారంపై ఎట్టకేలకు సీఆర్‌డీఏ స్పందించింది. గురువారం అమరావతి నుంచి తరలిస్తున్న సామగ్రిని సీఆర్‌డీఏ అధికారులు అడ్డుకున్నారు. అమరావతిలోని తాళ్లాయిపాలెం గ్రామంలో ఎల్‌అండ్‌టీ సంస్థకు చెందిన యార్డ్‌ నుంచి భూగర్భ విద్యుత్తు కేబుళ్లకు అమర్చేందుకు ఉపయోగించే ప్లాస్టిక్‌ స్పేసర్‌లను తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఎల్‌అండ్‌టీ స్టాక్‌ యార్డులో సీఆర్‌డీఏ ఇంజినీరింగ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే, ప్లాస్టిక్‌ స్పేసర్‌లకు సీఆర్‌డీఏ ఎలాంటి బిల్లులు చెల్లించలేదని అధికారులు స్పష్టం చేశారు. 

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సామగ్రిని తరలించడం పట్ల సంబంధిత గుత్తేదారు సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు సీఆర్‌డీఏ తెలిపింది. ఇకపై అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు ఉద్దేశించిన సామగ్రి తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని గుత్తేదారు సంస్థలకు సీఅర్‌డీఏ స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో గత కొన్ని రోజులుగా విద్యుత్తు తీగల బండిళ్ల తరలింపు కొనసాగింది. మంగళవారం ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ 8 బండిళ్లను 4 కంటెయినర్లలో విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురానికి తీసుకెళ్లింది. ఎన్నికల ఫలితాలు రావడానికి కొద్ది రోజుల ముందు రాజధాని సామగ్రిని తరలించడం దారుణమని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు