Cyclone Mandous: మాండౌస్‌ ఎఫెక్ట్‌‌.. 16 విమానాల రద్దు

అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్‌ తీవ్ర తుపాను (Cyclone Mandous) నుంచి అతి తీవ్ర తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చెన్నై నుంచి  16 విమానాలను రద్దు చేశారు.

Updated : 09 Dec 2022 19:53 IST

చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్‌ తీవ్ర తుపాను (Cyclone Mandous) నుంచి అతి తీవ్ర తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తీరం దాటే సమయంలో 89 నుంచి 117 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ విభాగం (imd) వెల్లడించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చెన్నై నుంచి బయలు దేరాల్సిన 16 విమానాలను రద్దు చేశారు. ఇందులో అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. అప్‌డేట్స్‌ కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ట్విటర్‌లో పేర్కొంది.

మరోవైపు తుపాను ముప్పు నేపథ్యంలో తమిళనాడులోని చెంగలపట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మాండౌస్‌ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్న 12 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దంటూ పుదుచ్ఛేరి పోర్టులో హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. అంతేకాకుండా గ్రేటర్‌ చెన్నై పరిధిలో అన్ని పార్కులు, ఆటస్థలాలను మూసివేయాల్సిందిగా స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం మాండౌస్‌ తీవ్ర తుపాను మల్లాపురానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమైందని ఐఎండీ వెల్లడించింది. పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజామున మామల్లాపురం సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు