Cyclone michaung: తరుముకొస్తోన్న ‘మిగ్‌జాం’.. 90-110 కి.మీ వేగంతో ఈదురు గాలులు!

మిగ్‌జాం తుపాను (Cyclone michaung) తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కావలికి 40కి.మీ, బాపట్లకు 80 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది.

Updated : 05 Dec 2023 10:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మిగ్‌జాం తుపాను (Cyclone michaung) తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కావలికి 40కి.మీ, బాపట్లకు 80 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుపాను కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని ఐఎండీ  తెలిపింది. కొంతభాగం సముద్రంలో.. మరికొంత భూమిపై ఉన్నట్లు వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 7కి.మీ వేగంతో ఉత్తర దిశగా తుపాను కదులుతున్నట్లు తెలిపింది. 

‘మిగ్‌జాం’ ఎఫెక్ట్‌తో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు, జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. నాగాయలంక మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వర్షాల తీవ్రతకు నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఆ జిల్లాలో తీర ప్రాంతంలోని 9 మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాల గేట్లను తితిదే అధికారులు ఎత్తివేశారు. భారీగా చేరిన వరదనీటితో జలాశయాలు పూర్తిగా నిండిన కారణంగా ఒక్కో గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వర్షం, గాలుల తీవ్రతకు బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా సరఫరా లేదు. 

తుపాను ప్రభావంతో వీస్తున్న గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో పంటపొలాల్లోకి వరదనీరు చేరింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం కలిగింది. పలుచోట్ల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని