Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Updated : 01 Dec 2023 20:00 IST

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారానికి తుపాను (Cyclone)గా మారి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్షించారు. ఏపీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని, తీరప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు సీఎస్‌ జవహర్‌ రెడ్డి వెల్లడించారు. తుపాను ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని సీఎస్ వివరించారు.

తీరప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపారు. ఈనెల 4వ తేదీ సాయంత్రానికి చెన్నై- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నట్టు ఐఎండీ అంచనా వేసిందని వివరించారు. మరోవైపు తీరప్రాంత జిల్లాల్లోని మత్స్యకారులెవరూ శనివారం ఉదయం నుంచి సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు వివరించారు. అలాగే తీరప్రాంతాల్లో తుపాను నష్ట తీవ్రతను తగ్గించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సన్నద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అటు తూర్పు నౌకాదళ కమాండ్ కూడా అత్యవసర సామగ్రి, నౌకలతో సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.

తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో పౌరసరఫరాల విభాగం ద్వారా నిత్యావసర సరకులు కూడా అందించేలా చర్యలు చేపట్టామన్నారు. నీటిపారుదల, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలను అప్రమత్తం చేసినట్టు సీఎస్ వివరించారు. ఏటిగట్లు, వంతెనలు తదితర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు వివరించారు. రక్షిత మంచినీటి సరఫరా, విద్యుత్, టెలికం, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులను కూడా పూర్తిగా అప్రమత్తం చేశామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు