Viveka Murder case: వారిద్దరి నుంచి ప్రమాదం పొంచి ఉంది: దస్తగిరి

ఎంపీ అవినాశ్‌రెడ్డి, సీఎం జగన్‌తో తనకు ప్రమాదం పొంచి ఉందని వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎర్రగుంట్లలో మీడియాతో మాట్లాడారు.

Updated : 20 Apr 2023 10:49 IST

ఎర్రగుంట్ల: ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డిల నుంచి ఇప్పటికీ తనకు ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అన్నారు. వివేకా కుమార్తె సునీత, సీబీఐ నుంచి తాను రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుంట్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అప్రూవర్‌గా మారడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. అప్రూవర్‌గా మారేవేళ అవినాష్‌ లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదు? మీ వరకు రానంత వరకు దస్తగిరి మంచోడు. ఇప్పుడు చెడ్డవాడా? అప్పుడు డబ్బుకు ఆశపడే ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు చేశాం. ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టే సీబీఐకి నిజం చెప్పేశా.’’ అని దస్తగిరి మీడియాకు తెలిపారు.

పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ను కూడా మార్చేశారని దస్తగిరి అన్నారు. ‘‘ ఆయన్ను మార్చితే కొత్త బృందం కొత్తకోణంలో విచారిస్తుందా? కేసులో మీ పాత్ర తెలుసు కనుక.. ఎవరైనా అలాగే దర్యాప్తు చేస్తారు. తప్పు చేశాను కాబట్టే.. ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సిద్ధపడ్డాను. పులివెందుల వైఎస్‌ జయమ్మ కాలనీలోనే ఉన్నా. ఎక్కడికీ పారిపోను.. దేనికైనా సిద్ధంగానే ఉన్నా. నేను తప్పు చేస్తే జైలుకెళ్తా.. మీరు తప్పు చేస్తే మీరు వెళ్తారు. మీరు తప్పు చేసినట్లు రుజువైతే రాజీనామా చేస్తారా?అని సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డిని దస్తగిరి ప్రశ్నించారు. సీబీఐ నన్ను దిల్లీ పిలిచినప్పుడు భరత్‌ యాదవ్‌ తనతోపాటు వచ్చారని దస్తగిరి పేర్కొన్నారు.. సీబీఐకి ఏం చెబుతానో తెలుసుకునేందుకే వైకాపా నేతలు ఆయన్ను పంపారని అన్నారు. ‘‘వైకాపా నేతల అండతోనే  భరత్‌ యాదవ్‌కు తుపాకీ వచ్చింది. ఆయన ఇటీవల పులివెందులలో కాల్పులు జరిపాడు. అలాంటి వ్యక్తులకు పోలీసులు తుపాకులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు కానీ, అప్రూవర్‌గా మారిన నాకు ప్రాణహాని ఉందంటే తుపాకీ ఇవ్వరా?’’ అని దస్తగిరి మీడియాకు తెలిపారు.

వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐ వేగం పెంచిన సంగతి తెలిసిందే.  ఈ కేసు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, ఆయన భార్య వైఎస్‌ భారతికి సొంత మేనమామ, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి (72)ని సీబీఐ అధికారులు ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో అరెస్టు చేశారు. వివేకా హత్య, నేరపూరిత కుట్ర, ఆధారాల ధ్వంసం తదితర అభియోగాల కింద నమోదైన కేసులో భాస్కరరెడ్డిని అరెస్టు చేశారు.  ఆయన వద్ద రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి ఫ్లైట్‌ మోడ్‌లో ఉందని మెమోలో తెలిపారు. అనంతరం భాస్కరరెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌ తరలించి, అక్కడ సీబీఐ జడ్జి ఇంటివద్ద హాజరుపరిచారు.

వివేకా హత్యకు వైఎస్‌ భాస్కరరెడ్డి మరికొందరితో కలిసి కుట్ర చేసి... దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా అమలు చేయించారనేది సీబీఐ ప్రధాన అభియోగం. హత్య తర్వాత దాన్ని గుండెపోటుగా చిత్రీకరించేందుకు వీలుగా ఘటనా స్థలంలో ఆధారాలన్నీ ధ్వంసం చేయించారని ఇప్పటికే సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసింది. మరోవైపు ఎంపీ అవినాష్‌ రెడ్డిని కూడా ఇవాళ సీబీఐ  విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే, చివర్లో దానిని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్‌ ద్వారా సందేశం పంపింది. రేపు సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరుకావాలని తెలిపింది. కేసు దర్యాప్తు వేగం పెరిగిన నేపథ్యంలో దస్తగిరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని