Dastagiri: ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పక్కనే ఉంటున్నా.. దేనికైనా సిద్ధమే: దస్తగిరి

నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న దస్తగిరి.. శుక్రవారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు.

Updated : 23 Feb 2024 21:37 IST

కడప: గత అసెంబ్లీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని సానుభూతితో జగన్‌ ఎన్నికల్లో గెలుపొందారని.. ఇప్పుడు మళ్లీ అదే కుట్రతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు. నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న దస్తగిరి.. శుక్రవారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు. యర్రగుంట్ల, వేముల పోలీసులు పెట్టిన అట్రాసిటీ, దాడి కేసుల్లో బెయిలు మంజూరు కావడంతో బయటికొచ్చారు. కడప జైలు అతిథిగృహంలో సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చి పోలీసు బందోబస్తు మధ్య పులివెందులకు వెళ్లారు.

రాజీకి రావాలని అభ్యర్థించారు..

వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్నాననే ఉద్దేశంతోనే.. వైకాపా పెద్దలు కుట్ర పన్ని కేసుల్లో ఇరికించి జైలుకు పంపించారని దస్తగిరి మీడియాకు వెల్లడించారు. జైల్లో ఉన్న సమయంలోనే వివేకా కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి తనను కలిశారన్నారు. డబ్బు ఆశచూపి రాజీకి రావాలని అభ్యర్థించారని పేర్కొన్నారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభపెట్టారన్న దస్తగిరి.. అప్రూవర్‌ నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పినట్టు వెల్లడించారు.

పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి వద్దనే తాను నివాసం ఉంటున్నానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. వివేకా విషయంలో తప్పు చేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్‌గా మారానని, మరోసారి తప్పు చేయదల్చుకోలేదన్నారు. చావడానికైనా సిద్ధమే కానీ, జగన్‌, అవినాష్‌కు తలొగ్గనని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు