Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

Updated : 23 Dec 2023 09:27 IST


భద్రాద్రిలో స్వామివారికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌: వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. అందుకే, తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. వారిలో మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర బాబు, జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టిస్‌ ఎస్‌.ఎల్‌. భట్టి, జస్టిస్‌ శ్యామ్‌ సుందర్‌, జస్టిస్‌ తారాల రాజశేఖర్‌, కర్ణాటక గవర్నర్‌ ధావర్‌ చంద్‌ గెహ్లాట్‌, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్‌, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్‌, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్‌, ఉపసభాపతి వీరభద్ర స్వామి, తెదేపా నేత అచ్చన్నాయుడు ఉన్నారు. 

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 6.42 గంటలకు ఉత్తర రాజ గోపురం చెంత ఆలయ దేవుడు నారసింహుడు మహా విష్ణువు రూపంలో భక్త జనానికి దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యులతో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. భక్త జనులు తరలివస్తున్నారు. తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని