TTD: శ్రీవారి లడ్డూ ధర తగ్గించలేం: ఈవో ధర్మారెడ్డి

క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు యువత ముందుకు రావాలని తితిదే ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Updated : 02 Mar 2024 17:21 IST

తిరుమల: క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు యువత ముందుకు రావాలని తితిదే ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో శనివారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు ఈవో సమాధానమిచ్చారు. లడ్డూ ప్రసాదం ధరలు తగ్గించలేమని స్పష్టం చేశారు. 

ప్రశ్న: శ్రీవారి సేవకుల వయసు 60 ఏళ్ల నుంచి 65కి పెంచండి?(వెంకటేశ్వరరావు-హైదరాబాద్‌)

ఈవో: రోజూ వేలాది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించడానికి 60 ఏళ్ల లోపు వారైతే బాగా సేవలందిస్తారు.

ప్రశ్న: లడ్డూ ప్రసాదం రెండే ఇస్తున్నారు. ఒక్కో భక్తుడికి 10 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి? (రామలక్ష్మి- నంద్యాల)

ఈవో: స్వామివారిని ద‌ర్శించుకొన్న ప్రతి భ‌క్తుడికి ఒక ఉచిత ల‌డ్డూ అందిస్తున్నాం. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ‌ ఏకాద‌శి త‌దిత‌ర పర్వదినాల్లో మినహా మిగిలిన రోజుల్లో భ‌క్తులకు కావల‌సిన‌న్ని ల‌డ్డూలు పొంద‌వ‌చ్చు.

ప్రశ్న: శ్రీ‌వారి ల‌డ్డూ ప‌రిమాణం త‌గ్గింది. రేటు త‌గ్గించండి?(వెంక‌టేష్ - హైద‌రాబాద్‌)

ఈవో: ల‌డ్డూ బ‌రువు, ప‌రిమాణం తగ్గలేదు. ధర త‌గ్గించ‌డానికి అవ‌కాశం లేదు.

ప్రశ్న: మా స్నేహితులు ఇటీవ‌ల అమెరికా నుంచి శ్రీ‌వారి దర్శనానికి వచ్చారు. తితిదే బుక్ స్టాల్‌లో రూ.111ల గోవింద నామాల పుస్తకం అడిగితే, అక్కడి సిబ్బంది బ‌ల‌వంతంగా ఒక్కొక్కటి రూ.150 చొప్పున రెండు పుస్తకాలు ఇచ్చారు. ( నాగేశ్వరరావు-హైదరాబాద్)

ఈవో:  దీనిపై ప‌రిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందిపై చ‌ర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: తితిదేలోని అన్ని కార్యాలయాల్లో శ్రీ భ‌గ‌వ‌త్ రామానుజాచార్యులు ఫొటో పెట్టండి.(ధ‌నంజ‌య - చెన్నై)

ఈవో: ప్రస్తుతం శ్రీ‌వారు, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి ఫొటోలు మాత్రమే ఉంటాయి. మీ స‌ల‌హాను ఆగ‌మ స‌ల‌హా మండ‌లికి విన్నవిస్తాం. 

ప్రశ్న: 2009లో అష్టాదళ పాద‌ప‌ద్మారాధ‌న సేవ టికెట్లు కొనుగోలు చేశాం. అనివార్య కార‌ణాల వ‌ల్ల సేవ‌కు రాలేకపోయాం. తిరిగి టికెట్లు కేటాయించండి. (తిరుమ‌ల రెడ్డి - తిరుప‌తి)

ఈవో: అష్టాదళ పాద‌ప‌ద్మారాధ‌న సేవ టికెట్లు ప‌రిమిత సంఖ్యలో ఉంటాయి. ప‌రిశీలిస్తాం.

ప్రశ్న :  శ్రీ‌వారిని దగ్గరగా చూసే అవ‌కాశం క‌ల్పించండి. (సుధాక‌ర్ - గుంత‌క‌ల్లు, ర‌వీంద్ర - హైద‌రాబాద్‌)

ఈవో:  వీఐపీ సిఫారసు లేఖలు, శ్రీ‌వాణి ట్రస్టు ద్వారా టికెట్లు కొనుగోలు చేసి బ్రేక్ దర్శనం పొంద‌వ‌చ్చు.

ప్రశ్న: ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు, ఆర్జిత సేవ‌లు, రూ.300ల ఎస్‌ఈడీ టికెట్లు సెకన్లలో అయిపోతున్నాయి. ఎన్ని సార్లు  ప్రయత్నించినా పొంద‌లేక పోతున్నాం. (తుల‌సి- బెంగళూరు)

ఈవో:  శ్రీ‌వారిపై ఉన్న అచంచ‌ల భ‌క్తి వ‌ల్ల టికెట్లు త్వరగా అయిపోతున్నాయి. టికెట్ల బుకింగ్‌ను క్లౌడ్‌లో ఉంచుతున్నాం. మా వ్యవస్థ చాలా పారదర్శకంగా పనిచేస్తోంది.

ప్రశ్న :  సేవ, దర్శనం టికెట్లతో పాటు వ‌స‌తి బుక్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించండి. (నాగేంద్ర - గుంటూరు)

ఈవో:  ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దర్శనం, సేవా టికెట్లు పొందిన భ‌క్తుల‌కు వ‌స‌తి అందుబాటులోకి వ‌స్తుంది.

ప్రశ్న: గ‌తంలో శ్రీ‌వారి సేవ‌కుల‌కు చివ‌రి రోజు సుప‌థం నుంచి శ్రీవారి దర్శనం కల్పించారు. దానిని పునరుద్ధరించండి?(వెంక‌టేష్  -  వ‌రంగ‌ల్‌ )

ఈవో: గతంలో సుప‌థం ఉండేది, ప్రస్తుతం రూ.300/- క్యూ లైన్‌లోనే శ్రీ‌వారి సేవ‌కుల‌కు దర్శనం క‌ల్పిస్తున్నాం.

ప్రశ్న: ఎస్వీబీసీలో కార్యక్రమాలు బాగున్నాయి. నాద‌నీరాజ‌నం వేదిక‌పై విద్యార్థుల‌కు పురాణాల‌పై పోటీలు నిర్వహిస్తే వారిలో భ‌క్తి భావం పెరుగుతుంది. (నిఖిలేష్ - నెల్లూరు)

ఈవో: విద్యార్థుల‌కు భ‌గ‌వ‌ద్గీత పోటీలు, ఎస్వీబీసీలో అన్నమయ్య, వెంగ‌మాంబ సంకీర్తనలపై పోటీలు నిర్వహించి శ్రీ‌వారి దర్శనం కల్పిస్తున్నాం. విద్యార్థులకు అందించేందుకు భ‌గ‌వ‌ద్గీత‌ను ఐదు భాష‌ల్లో 15 పేజీలతో కోటి పుస్తకాలు ముద్రిస్తున్నాం.

ప్రశ్న: సప్తగిరి విశ్రాంతి గృహాలు, ఏఎన్‌సీ, జీఎన్‌సీ వ‌స‌తి గ‌దుల్లో గీజ‌ర్లు ప‌ని చేయ‌డం లేదు. పాంచజన్యంలో బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. వసతులు సరిగా లేవు. (కృష్ణకుమారి  - హైద‌రాబాద్, తరుణ్‌కుమార్ - కోయంబత్తూరు, మునిల‌క్ష్మీ - నెల్లూరు)

ఈవో: 50 ఏళ్ల క్రితం నిర్మించిన సప్తగిరి విశ్రాంతి గృహాల‌ను ఆధునీక‌రిస్తాం. కొత్త గీజ‌ర్లు పెట్టి అన్ని వ‌స‌తి గ‌దుల్లో వెంట‌నే కనెక్షన్‌ ఇవ్వాలని అధికారుల‌ను ఆదేశించాం. పాంచ‌జ‌న్యంలో బొద్దింక‌ల నివార‌ణ‌కు వెంట‌నే చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: తిరుపతి నుంచి తిరుమ‌లకు బస్సులను నామమాత్రపు ధరలకు తితిదే నడ‌పాలి. (వెంకటేష్ - హైదరాబాద్‌)

ఈవో:  తితిదేకి సాధ్యం కాదు.

ప్రశ్న : భ‌క్తులు తిరుమ‌ల‌కు ప్లాస్టిక్‌ వాట‌ర్ బాటిళ్లు తీసుకువ‌స్తున్నారు. అలిపిరి వ‌ద్ద చెకింగ్ స‌రిగ్గా జ‌ర‌గ‌డం లేదు. (అప్పన్న - విశాఖ‌ప‌ట్నం)

ఈవో: చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: ఆన్‌లైన్‌లో తిరుమ‌ల‌లో వ‌స‌తి బుక్ చేసుకున్నాను. ఇంకా ఎలాంటి మెసేజ్‌లు రాలేదు. (మ‌నోహ‌ర్ - మ‌స్కట్‌)

ఈవో: మా అధికారులు మీతో మాట్లాడి చర్యలు తీసుకుంటారు.

ప్రశ్న: దాత‌లు దర్శనానికి ఎలా వెళ్లాలి అనే దానిపై బోర్డులు ఏర్పాటు చేయండి. (ల‌క్ష్మి - విశాఖ‌ప‌ట్నం)

ఈవో: అధికారుల‌తో మాట్లాడి అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో సైన్‌ బోర్డులు ఏర్పాటు చేస్తాం.

ప్రశ్న: శ్రీ‌వారి సేవ ఆఫ్‌లైన్‌లో ఒక ఆధార్‌కు రెండు ఫోన్ నంబ‌ర్లు ఉండ‌టం వ‌ల్ల ఆన్‌లైన్‌లో బుక్ కావ‌డం లేదు. (దుర్గప్రసాద్‌ - కాకినాడ)

ఈవో: మా అధికారులు మీతో మాట్లాడతారు.

ప్రశ్న:  వ‌యోవృద్ధులు, దివ్యాంగుల‌కు స‌హ‌య‌కులుగా భార్య/భ‌ర్త కాకుండా వారి కుటుంబ‌స‌భ్యుల‌ను అనుమ‌తించండి. (సౌజ‌న్య - హైద‌రాబాద్‌)

ఈవో: వీరికి స‌హ‌య‌కులుగా భార్య లేదా భర్త, శ్రీ‌వారి సేవ‌కులు ఉంటారు. ప‌రిశీలిస్తాం.

ప్రశ్న: ఆన్‌లైన్‌లో వ‌యోవృద్ధులు దర్శనం బుక్ చేసుకోవ‌డం చాలా బాగుంది. కానీ 3 నెల‌ల ముందు బుక్ చేసుకుంటే వారి ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా బుకింగ్ స‌మ‌యాన్ని త‌గ్గించండి. (శ్రీ‌కాంత్  - హైద‌రాబాద్‌)

ఈవో:  ప‌రిశీలిస్తాం.

ప్రశ్న: శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ‌తంలో 3, 5 రోజుల సేవ ఉండేది. ప్రస్తుతం 7 రోజుల సేవ మాత్రమే ఉంది. తిరిగి 3, 5 రోజులు ప్రవేశపెట్టండి. (రాధ  - విశాఖ‌ప‌ట్నం)    
ఈవో: శ్రీ‌వారి సేవ‌కుల‌కు అవ‌గాహ‌న‌ క‌ల‌గ‌డానికి రెండు రోజులు ప‌డుతుంది. అందుకే ఏడు రోజులుగా నిర్ణయించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు