YSRCP: మచిలీపట్నంలో వైకాపా అడ్డదారులు.. పేదలకు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ

ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందడానికి మచిలీపట్నం వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు.

Published : 03 Apr 2024 16:34 IST

మచిలీపట్నం: ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందడానికి మచిలీపట్నం వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు, రెవెన్యూ రికార్డుల్లో కనిపించని సర్వే నంబర్లతో రూపొందించిన ఇళ్ల పట్టాలపై జగనన్న బొమ్మ ముద్రించి పంపిణీ చేసేస్తున్నారు. ఇలాంటివి కొన్ని ఇప్పటికే చెలామణిలో ఉండగా నగర పరిధిలో ఒకేసారి పెద్ద ఎత్తున పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం రహదారి మార్జిన్లు, చెరువు గట్లు, ప్రభుత్వ స్థలాలు, శ్మశానవాటికల స్థలాలపై దొంగ పొజిషన్‌ సర్టిఫికెట్లు, నకిలీ పట్టాలు సృష్టిస్తున్నారు. పోలింగ్‌ తేదీ నాటికి పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

వీఆర్వోను సస్పెండ్‌ చేసి.. విచారణ చేపట్టిన అధికారులు

పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో దొంగ ఇళ్ల పట్టాల పంపిణీపై జాయింట్‌ కలెక్టర్‌ విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో 11వ డివిజన్‌ వీఆర్‌వో శ్రీదేవిని అధికారులు సస్పెండ్‌ చేశారు.ఇళ్ల స్థలాలకు సంబంధించి హద్దులు, సర్వే నంబరు లేకుండా పట్టాలు ఎవరు సిద్ధం చేశారన్న అంశంపై అధికారులు విచారణ చేస్తున్నారు. పట్టాలను రుపోందించడంలో  వీఆర్ఓ శ్రీదేవి పాత్ర ఉందని అధికారులు తేల్చారు. రాజకీయ పార్టీల ప్రొద్బలంతోనే వీటిని రూపోందించారని మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు విఆర్వో శ్రీదేవిని సస్పెండ్ చేసినట్లు ఆర్డీవో తెలిపారు.

అసలును మరిపిస్తూ...

అసలు వాటిని తలదన్నేలా ఈ నకిలీ పట్టాలను వైకాపా నాయకులు రూపొందించారు. వాటిల్లో సదరు భూమిని ఎస్‌ఎఫ్‌(స్ట్రీట్‌ఫీల్డ్‌) సర్వే నంబరుగా చూపుతున్నారు. ఎస్‌ఎఫ్‌ సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో కనిపించవు. అధికారికంగా ఇచ్చే పట్టాల్లో స్థల వివరాలు, సరిహద్దులు, లేఅవుట్‌ నంబర్‌ తదితరాలు ఉండాలి. తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో వివరాలు నమోదు చేసిన అనంతరం ఎంపిక చేసిన లబ్ధిదారులకు అందజేయాలి. అధికార పార్టీ నాయకులు ఇస్తున్న వాటిల్లో ప్రభుత్వ సీల్‌, తేదీ, సంబంధిత సిబ్బంది సంతకాలు లేకుండా బదీలీపై వెళ్లిపోయిన తహసీల్దార్‌ సునీల్‌బాబు సంతకం ఒక్కటే కనిపిస్తోంది. ఆ సంతకం కూడా అసలైనదా లేదా ఫోర్జరీనా అనే విషయంపైనా సందేహాలు కలుగుతున్నాయి. కొన్ని పట్టాలపై ఉన్న తహసీల్దార్‌ సంతకం ఎవరిదో కూడా తెలియడం లేదు. సీఎం జగన్‌ చిత్రం ఉండటంతో సదరు లబ్ధిదారులు మాత్రం తమకు ఇంటి స్థలం దక్కిందని నమ్ముతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని