ఠారెత్తిస్తోన్న ఎండలు.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న వేళ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు.

Published : 16 Apr 2024 09:55 IST

Summer Effect| ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే వణుకు పుడుతోంది. ఇప్పటికే తెలంగాణలో 42 డిగ్రీలుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత, వడగాలుల సమయంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. అవేంటంటే?

ఏం చేయాలి?

  • తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, వాంతులు ఇతర సమస్యలు ఏర్పడితే వడదెబ్బగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.
  • నెత్తిన టోపీ పెట్టుకోవాలి లేదా రుమాలు కట్టుకోవాలి. తెల్లని రంగు కలిగిన కాటన్‌ వస్త్రాలు ధరించాలి.
  • ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు గానీ, నిమ్మరసం, కొబ్బరి నీరు గానీ తాగాలి.
  • వడదెబ్బకు గురైనవారు సాధారణ స్థితికి రానట్లయితే శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
  • ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్‌, ఓఆర్‌ఎస్‌ కలిపిన నీరు తాగవచ్చు.
  • ఓఆర్‌ఎస్‌, ఇంట్లో తయారుచేసే లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ వంటివి పానీయాలు తీసుకోండి. ఇవి శరీరారన్ని తిరిగి హైడ్రేట్‌ చేయడానికి సహాయపడతాయి.
  • జంతువులను నీడలో ఉంచండి. అవి తాగేందుకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంచండి. 
  • ఇంటిని చల్లగా ఉంచుకొనేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి. చల్లని నీటితో స్నానం చేయండి.
  • శరీరాన్ని చల్లబరిచేందుకు ఫ్యాన్‌, తడి దుస్తులు ఉపయోగించండి. ఒంటరి వృద్ధులు/అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యాన్ని రోజూ పర్యవేక్షించండి.
  • బయటకు వెళ్లినప్పుడు చలువ కళ్లద్దాలు, గొడుగు/టోపీతో పాటు అనువైన పాదరక్షలు ధరించండి. 

ఏం చేయొద్దు?

  • బాలింతలు, చిన్న పిల్లలు, వయో వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగవద్దు.
  • ఎక్కడికైనా బయటకు వెళ్తే వెంట ఓ బాటిల్‌తో నీళ్లు తీసుకెళ్లడం మరిచిపోవద్దు.
  • మధ్యాహ్నం తరువాత (ఉదయం 10 గంటల నుంచి సాయం 3 గంటల మధ్య కాలంలో) బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని చేయరాదు.
  • ఎండలో నుంచి వచ్చిన వెంటనే తెనె వంటి తీపి పదార్థాలు తీసుకోవద్దు.
  • సూర్య కిరణాలకు, వడగాలికి గురికాకుండా జాగ్రత్త పడాలి. ఎండలో గొడుగు లేకుండా తిరగవద్దు.
  • శీతల పానీయాలు, ఐస్‌ వంటివి తీసుకుంటే అనారోగ్యం బారిన పడతారు.. జాగ్రత్త.
  • ఆల్కహాల్‌, టీ, కాఫీ, సోడాలు వంటి డీహైడ్రేటింగ్‌ పానీయాలకు దూరంగా ఉండండి. 
  • అధిక ప్రోటీన్ కలిగిన ఆహారానికి దూరంగా ఉండండి. తాజాగా వండిన ఆహార పదార్థాలే తీసుకోండి.
  • పార్కు చేసిన వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులను వదిలి వెళ్లొద్దు. 
  • పశువులు, మూగ జీవాలను ఎండలో ఉంచొద్దు. నీడ ఉన్న పాకలు, షెడ్లలో ఉంచండి. అవి ఉన్న షెడ్‌లలో ఫ్యాన్లు లేదా వేడిని అదుపు చేసేందుకు నీటి తుంపర్లు, చల్లపరిచే వ్యవస్థను ఏర్పాటుచేయండి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని