నోబెల్‌ ప్రైజ్‌లాంటిదే ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌.. కానీ!

ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారిని నోబెల్‌ ప్రైజ్‌తో సత్కరిస్తుంటారు. నోబెల్‌తోపాటు రూ. కోట్ల నగదు బహుమతి ఉంటుంది. శాస్త్రవేత్తలకు, సాహితీవేత్తలకు, శాంతి కోసం పోరాడే వారికే ఈ నోబెల్‌ ప్రైజ్‌ వరిస్తుంటుంది. తాజాగా నోబెల్‌కి సరితూగేలా

Updated : 12 Oct 2020 09:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారిని నోబెల్‌ ప్రైజ్‌తో సత్కరిస్తుంటారు. నోబెల్‌తో పాటు రూ.కోట్ల నగదు బహుమతి కూడా ఉంటుంది. శాస్త్రవేత్తలకు, సాహితీవేత్తలకు, శాంతి కోసం పోరాడే వారికే ఈ పురస్కారం వరిస్తుంటుంది. తాజాగా నోబెల్‌కి సరితూగేలా ప్రిన్స్‌ విలియమ్ ఓ ప్రైజ్‌ను ఆవిష్కరించారు. అదే ‘ఎర్త్‌షాట్‌’ ప్రైజ్‌. భూమి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వారికి ఈ ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

భూమి ఎన్నో విపత్తులను ఎదుర్కొంటోంది. ప్రకృతి తెచ్చేవి కొన్ని అయితే, మానవుల వల్ల మరికొన్ని. భూమిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, గాలిలో విషపూరిత వాయువులు, చెరువులు, నదుల్లో విషయపూరిత రసాయనాలు ఇలా ఎక్కడ చూసినా కాలుష్యమే. వెరసి భూతాపం పెరిగి జీవకోటి ప్రమాదంలో పడుతోంది. అందుకే పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఈ అంశాలపై ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతోమంది నడుంబిగించారు. ఈ విషయంలో ప్రిన్స్‌ విలియమ్ మరో అడుగు ముందుకేశారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారం కనిపెట్టి.. ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకొచ్చే వారికి ఏటా ఈ ‘ఎర్త్‌షాట్‌’ ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఛారిటీలకు మద్దతుగా నిలిచే ‘ది రాయల్‌ ఫౌండేషన్‌’తో కలిసి 50మిలియన్‌ పౌండ్లు(దాదాపు రూ.476కోట్లు)పెట్టి ఫండ్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రైజ్‌లో ఐదు విభాగాలు ఉన్నాయి. 1) ప్రకృతిని కాపాడటం, పునరుద్ధరించడం, 2) గాలిని శుద్ధి చేయడం, 3) సముద్రాలను పునరుద్ధరించడం, 4) వ్యర్థరహిత ప్రపంచాన్ని నిర్మించడం, 5) వాతావరణాన్ని సమతుల్య పర్చడం. ఏటా ఈ ఐదు అంశాల్లో విశేషంగా కృషి చేసిన ఐదుగురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 1మిలియన్‌ పౌండ్ల(దాదాపు రూ.9.5కోట్లు)చొప్పున ‘ఎర్త్‌షాట్‌’ ప్రైజ్‌ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది అంటే 2021 నుంచి 2030 వరకు లండన్‌లో ఏటా ఒక కార్యక్రమం నిర్వహించి విజేతలకు ఈ ప్రైజ్‌ అందజేయనున్నారు.

‘‘భూమి ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం మన ముందు రెండు అవకాశాలున్నాయి. ఒకటి మనం ఇలాగే ఉంటూ భూమికి కోలుకోలేని విధంగా నష్టం కలిగించడం. లేదా మానవులుగా మన శక్తి ఏంటో గుర్తించి పర్యావరణ సమస్యలను పరిష్కరించడం. ప్రజలు ఎన్నో సాధించగలరు. వచ్చే పదేళ్లు మనకు పరీక్షా సమయం’’ - ప్రిన్స్‌ విలియమ్

వచ్చే పదేళ్లలో భూమి, పర్యావరణాన్ని మళ్లీ సాధారణస్థితికి తేవడమే లక్ష్యంగా ఈ ‘ఎర్త్‌షాట్‌’ ప్రైజ్‌ను ఆవిష్కరించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీటి ద్వారా పర్యావరణ సమస్యలకు 50 పరిష్కారాలు లభిస్తాయని అంటున్నారు. ఈ ‘ఎర్త్‌ షాట్‌’ ప్రైజ్‌ విజేతలను ఎంపిక చేసేందుకు ఓ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ఇందులో జోర్డాన్‌ రాణి క్వీన్‌ రానియా అల్‌ అబ్దుల్లా, ఆస్ట్రేలియాకు చెందిన నటి కేట్‌ బ్లాంచెట్‌, ఐకాస వాతావరణ విభాగం మాజీ చీఫ్‌ క్రిస్టియానా ఫిగెర్స్‌, బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డానీ అల్వెస్‌, ప్రకృతి చరిత్రకారుడు.. మీడియా ప్రతినిధి సర్‌డేవిడ్‌ అటెన్‌బరో, పర్యావరణవేత్త హిందొవు ఒమరొవు ఇబ్రహీం, పెప్సీ కో మాజీ సీఈవో ఇంద్రా నూయి, చైనాకు చెందిన వ్యాపారవేత్త జాక్‌ మా, జపాన్‌కు చెందిన మాజీ వ్యోమగామి నవకొ యమజకి, ఆర్థికవేత్త నొజి ఒకంజొ ఇవెలా, పాప్‌ సింగర్‌ షకీరా, చైనాకు చెందిన పర్యావరణవేత్త యా మింగ్‌ ఉన్నారు. ప్రస్తుతం ‘ఎర్త్‌షాట్‌’ బాధ్యతలను ‘ది రాయల్‌ ఫౌండేషన్‌’ తీసుకుంది. వచ్చే ఏడాదికి ‘ఎర్త్‌షాట్‌’ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా మారుతుందట. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని