Delhi: మద్యం కుంభకోణం కేసు.. 3వేల పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు 3000 పేజీల డాక్యుమెంట్‌ను దిల్లీలోని రౌస్‌ అవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించింది. 

Published : 26 Nov 2022 15:55 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మూడు వేల పేజీల ఛార్జిషీట్‌ను దిల్లీ రౌస్‌ అవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించింది. ప్రస్తుతానికి ఇండో స్పిరిట్‌ యజమాని సమీర్‌ మహేంద్రుని నిందితుల జాబితాలో చేర్చిన ఈడీ.. మిగిలిన నిందితులపై త్వరలో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని తెలిపింది. ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది. దీనిని పరిగణనలోకి తీసుకునేందుకు సమయం పడుతుందని పేర్కొంది.

మరోవైపు ఇదే కేసుపై దర్యాప్తు చేపడుతున్న సీబీఐ కూడా నిన్న తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏడుగురిని నిందితులుగా చేరుస్తూ సుమారు 10 వేల పేజీల ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూలోని ప్రత్యేక కోర్టులో సమర్పించింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి బోయినపల్లి అభిషేక్‌, ఇండియా ఏహెడ్‌ అధినేత ముత్తా గౌతమ్‌ కూడా ఉన్నారు. అయితే, సీబీఐ ఆగస్టు 17న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా ఉన్న దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా పేరు సీబీఐ ఛార్జిషీట్‌లో గానీ, తాజాగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో గానీ లేకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని