జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలతో చెక్‌ చెప్పండి!

 19ఏళ్లలో జుట్టు రాలటం మొదలైతే! 25ఏళ్లలో జుట్టు పలచబడితే! 35వ ఏటే బట్టతల వచ్చేస్తే.. ఇలా భయపడుతున్న వారెందరో..

Updated : 28 Nov 2020 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  19 ఏళ్ల వయస్సులో జుట్టు రాలటం మొదలైతే! 25ఏళ్లలో జుట్టు పలచబడితే! 35వ ఏటే బట్టతల వచ్చేస్తే.. ఇలా భయపడుతున్న వారెందరో..! ఇప్పుడు కుర్రకారు చెప్పుకోలేని బాధ.. తీరని వ్యథ.. నలుగురిలో తిరగాలన్నా, అందంగా కనిపించాలన్నా ఒత్తైన జుట్టు ఉండాల్సిందే. మరి ఈ మధ్య మీ జుట్టు రాలుతోందా? చేతులతో తాకితేనే ఊడుతోందా! అందుకు వంశపారంపర్యం, నిద్ర సమస్యలు, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి ఇలా అనేక కారణాలుండొచ్చు. కానీ కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు చెక్‌ చెప్పొచ్చు. ఒత్తైన జుట్టును కాపాడుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..!

నిద్ర సమస్యలు జయిద్దాం
ఉరుకుల పరుగుల జీవితం. తీరికలేని పని. దీంతో ఒత్తిడి, నిద్రలేమి. ఇది కేవలం మీ ఆరోగ్యంపైనే కాకుండా మీ జుట్టు ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. దీంతో ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. ఒత్తిడి హార్మోన్‌లు ఆడ్రినలిన్‌, కార్టిసాల్‌ జుట్టు సహజ పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే ఒత్తిడి తగ్గించుకునేందుకు, నిద్ర సమస్యలను జయించేందుకు మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మనసును ప్రశాంతంగా మార్చుకునేందుకు యోగా, ధ్యానం చేయాలి. శారీరక శ్రమకు సమయం కేటాయించాలి. రోజులో 30నిమిషాలు తప్పక వ్యాయామం చేయాలి. నడక, పరుగు, ఈత తదితర వ్యాయామాలు ప్రయత్నించొచ్చు. దీంతో ఒత్తిడి స్థాయిలు తగ్గడమే కాకుండా నిద్ర సమస్యలకు చెక్‌పెట్టొచ్చు. అది జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇక శరీరానికి సరిపడ నీటిని తాగాలి. 

ఈ ఆహారం తీసుకోండి
మంచి ఆహారం జుట్టును ఆరోగ్యవంతంగా మార్చుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు కణాలలో కెరోటిన్‌ ప్రొటీన్‌ ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యకరంగా చూస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా ఉంటాయి. అందుకే ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండే గుడ్లు, చేపలు, సొయా, పాలు, పప్పు, గింజలు తదితర ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. ఐరన్‌, జింక్‌ ఎక్కువగా ఉన్న ఆహారం జుట్టును దృఢంగా తయారు చేస్తుంది. జింక్‌ లోపంతో జుట్టు త్వరగా రాలిపోతుంది. గుమ్మడి గింజలు, వేరుశనగ, నువ్వులూ తదితర పదార్థాల్లో జింక్‌ శాతం ఎక్కువ. వీటిని ప్రయత్నించండి. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆకుకూరలను ఎంచుకోండి. విటమిన్లు ఏ, ఇ, బి, డీ లతో పాటు బయోటిన్‌ మీ జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. జుట్టును మెరిసేలా చేసే మెలనిన్‌ ఉత్పాదకతను పెంచేందుకు బి-విటమిన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి.

ఇలా చేయకూడదు..

జుట్టు తడిగా ఉన్న సమయంలో బలహీన స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో టవల్‌తో తడి జుట్టుపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురాకూడదు. సహజంగా పొడిగా ఆరేలా చూసుకోవడమే మంచిది. హెయిర్‌ డ్రయ్యర్‌ను వాడడం తగ్గించుకోండి. తడి జుట్టుపై దువ్వెనను వాడకండి. దానికి బదులుగా మీ చేతి వేళ్లను ఉపయోగించండి. లేదా వెడల్పాటి దువ్వెనలు వాడండి. కఠినమైన రసాయనాలు, హెయిర్‌ కలర్‌ ఉత్పత్తులు ఎక్కువగా వాడటం జుట్టుకు హాని కలిగిస్తాయి. ఇక వెంట్రుకలపై ఒత్తిడి పెంచే హెయిర్‌ స్టైల్స్‌కి దూరంగా ఉండటం మంచిది. రోజు విడిచి రోజు రసాయనాలు లేని షాంపూతో జుట్టును శుభ్రం చేస్తుండాలి. సహజ కండిషనర్‌లను వాడాలి. దీంతో జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది. వీలైనంత మేర చల్లని నీటితో తలస్నానం చేయండి. 

ఇవి ప్రయత్నించొచ్చు

గోరువెచ్చని నూనెతో మీ తలని క్రమం తప్పకుండా కొన్ని నిమిషాలపాటు మసాజ్‌ చేయండి. ఇది కుదుళ్లు చురుకుగా ఉండేందుకు సాయపడుతుంది. మాడపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చుండ్రుని తగ్గించుకునేందుకు ఇది చక్కగా పని చేస్తుంది. అంతేకాదు కొత్త జుట్టు తంతువులను ఏర్పరచడంలోనూ తోడ్పడుతుంది. అందుకు కొబ్బరి లేదా బాదం లేదా నువ్వుల నూనెను ప్రయత్నించొచ్చు. మరింత ప్రభావం చూపేందుకు కొబ్బరి, బాదం నూనెల మిశ్రమానికి జుట్టుకు పట్టించొచ్చు. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేయండి.

ఇంటి చిట్కాలతో ఉపయోగం
* రాత్రి పడుకునే సమయంలో వెల్లుల్లి రసాన్ని జుట్టుకు రాసుకుని పడుకోవాలి. ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. 
* ఇక ఉల్లిపాయ యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు అంటించడం ద్వారా కుదుళ్లు దృఢంగా తయారవుతాయి. తలపై రక్తప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. జుట్టు పెరుగుదలకి ప్రేరేపిస్తుంది. వారానికి రెండు సార్లు ఉల్లి రసాన్ని తలకి అంటించి అరగంట తర్వాత కడిగితే సరి. 
* కలబంద గుజ్జు మీ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మీ జుట్టుపై నేరుగా కలబంద గుజ్జు ఉంచి కాసేపటి తర్వాత కడగండి. కొబ్బరి నూనెలో కలబంద గుజ్జు కలిపి తలకి అంటిస్తే మరింత మంచి ఫలితాలను పొందొచ్చు. 
* కొబ్బరి పాలలో ఖనిజాలు, ప్రొటీన్‌లు, అవసరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఒక కప్పు కొబ్బరి పాలని తలకి అంటించి మసాజ్‌ చేయండి. ఓ అరగంట తర్వాత చల్లటి నీరు, షాంపూతో శుభ్రం చేయండి. ఇది మీ జుట్టుని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది.

* ఉసిరిలో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్‌-సి పుష్కలంగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు ఉసిరిని ప్రతిరోజు తినండి. అంతేకాదు ఉసిరి పౌడర్‌ని నీటిలో కలిపి తలకీ రాయొచ్చు. ఇది జుట్టు పెరుగుదలకి ప్రోత్సహిస్తుంది. 
* ఒక కప్పు వేడినీటిలో రెండు గ్రీన్‌ టీ బ్యాగులను అందులో వేయండి. చల్లబడిన తర్వాత దాన్ని తలకు రాసుకోండి. ఓ గంటపాటు ఇలా ఉంచిన తర్వాత చల్లని నీటితో కడిగేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని