MLC Kavitha: దిల్లీ మద్యం కేసు.. కవిత జ్యుడిషియల్‌ కస్టడీ ఈ నెల 7 వరకు పొడిగింపు..

మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని జూన్‌ 7 వరకు పొడిగించారు.

Updated : 03 Jun 2024 18:49 IST

దిల్లీ : దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించారు. జూన్‌ 7 వరకూ పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో జూన్‌ 7న సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేయనుంది. మరోవైపు ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్‌ రిమాండ్‌ను జులై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేయగా.. కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

దిల్లీ మద్యం కేసులో పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 44, 45 కింద 6వ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేశామని వెల్లడించింది. ఇదే కేసులో శరత్‌చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. మొత్తం 177 పేజీలతో ఛార్జిషీట్‌ ఫిర్యాదు కాపీ తయారైంది. ఈ కేసుకు సంబంధించి 36 మందిని ఈడీ నిందితులుగా చేర్చింది. ఎమ్మెల్సీ కవితను 32వ నిందితురాలిగా పేర్కొంది. ఆమె అసిస్టెంట్‌ అశోక్‌, ఆడిటర్‌ బుచ్చిబాబు స్టేట్‌మెంట్‌ను ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. 44 మంది సాక్షుల జాబితాను జతపరిచింది. 92 దస్త్రాలను ఆధారాలుగా చేర్చింది. కవితపై కోర్టు వెంటనే ట్రయల్‌ ప్రారంభించాలని ఈ సందర్భంగా ఈడీ విజ్ఞప్తి చేసింది. కవితతోపాటు ఇతర నిందితుల ఆస్తులు జప్తు చేయాలని కోరింది. మొత్తం 49 మందిని విచారించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు