Vizag: ప్రారంభించిన తెల్లారే.. విశాఖలో తెగిపోయిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి

ప్రారంభించిన ఒక్క రోజులోనే విశాఖలో నీటిపై తేలే వంతెన తెగిపోయింది.

Updated : 26 Feb 2024 23:20 IST

విశాఖ: ప్రారంభించిన ఒక్క రోజులోనే విశాఖలో నీటిపై తేలే వంతెన తెగిపోయింది. చివరి భాగం విడిపోయి కొద్దిదూరం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఫ్లోటింగ్‌ బ్రిడ్జిను ఆదివారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఫ్లోటింగ్‌ బ్రిడ్జి వైపు ప్రజలు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారు. అయితే, నిర్వహణలో భాగంగా వంతెనను విడదీసినట్లు నిర్మాణ సంస్థ చెబుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని సందర్శనకు అనుమతిస్తామని తెలిపింది.

ఈ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. విశాఖలో ప్రారంభించిన ఒక్కరోజులోనే జగన్‌ అవినీతి భారాన్ని తట్టుకోలేక ఫ్లోటింగ్‌ బ్రిడ్జి కొట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టే ఇలాంటి చర్యలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ‘ఎక్స్‌’(ట్విటర్‌) వేదికగా చంద్రబాబు విమర్శించారు. ‘‘అబ్బాయ్ ప్రారంభించిన బస్‌బే గాలికి ఎగిరిపోతే.. బాబాయ్ రిబ్బన్ కట్ చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి అలలకు కొట్టుకుపోయింది’’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. మూడు ముక్కలాట బ్యాచీ పనులన్నీ ఇంతే అని సెటైర్లు విసిరారు.

విశాఖలో ఫ్లోటింగ్ బిడ్జి సక్రమంగా కట్టలేని ముఖ్యమంత్రి జగన్‌కు రాజధాని కట్టగలిగే సత్తా ఉందంటే ప్రజలు నమ్ముతారా? అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. బ్రిడ్జి నిర్మాణంలో అవినీతి వల్ల నాణ్యత లోపం తలెత్తి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ మండిపడ్డారు. వంతెన తెగిన సమయంలో పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందన్నారు. విశాఖలో ఇప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి కూలింది.. త్వరలో వైకాపా ప్రభుత్వం పేక మేడలాగా కూలిపోతుందన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని