srinivas Goud: అక్రమ మద్యం సరఫరా కేసు.. తొలిసారి పీడీ చట్టం ప్రయోగం: శ్రీనివాస్‌ గౌడ్

అక్రమంగా మద్యం సరఫరా చేస్తే పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

Updated : 22 Jul 2023 22:02 IST

హైదరాబాద్‌: అక్రమంగా మద్యం సరఫరా చేస్తే పీడీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జార్ఖండ్‌కు చెందిన రాజారాం సింగ్.. హరియాణా నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నందుకు నిందితుడిపై పీడీ చట్టం కింద తొలి కేసు నమోదు చేశామని చెప్పారు. అక్రమ మద్యం విషయంలో తొలిసారి పీడీ చట్టం ప్రయోగించామన్నారు. రాజారాం సింగ్ నగరంలోని ముషీరాబాద్‌లో అక్రమ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారని.. గతంలో ఈ తరహా కేసులు అతనిపై నమోదయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో పీడీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

హానికారక రసాయనాలతో నాసిరకమైన మద్యం తయారు చేసి ఇతర రాష్ట్రాల మీదుగా తెలంగాణకు తీసుకొచ్చి విక్రయించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. విదేశాల నుంచి మద్యం తీసుకొచ్చినా.. ఆర్మీ క్యాంటీన్లలో రాయితీపై తీసుకొచ్చే మద్యం బాటిళ్లను బయట విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తీసుకురాకుండా పోలీస్, రవాణా శాఖ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని