మధుమేహమా?పర్వాలేదు.. ఈ పండ్లు తినొచ్చు..!

పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ, మధుమేహం ఉన్న వారు పండ్లు తినాలంటే కాస్త వెనకడుగువేస్తారు. ఎందుకంటే.. పండ్లలో చక్కెరస్థాయి ఎక్కువ ఉంటుందని.. వాటిని తింటే మధుమేహం పెరుగుతుందని భయం. ఆ మాట

Updated : 19 Feb 2021 18:41 IST

పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కానీ, మధుమేహం ఉన్న వారు పండ్లు తినాలంటే కాస్త జంకుతారు. ఎందుకంటే.. పండ్లలో చక్కెరస్థాయి ఎక్కువ ఉంటుందని.. వాటిని తింటే మధుమేహం పెరుగుతుందని భయం. ఆ మాట నిజమే. కానీ, అన్ని పండ్లు హానికరం కావు. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే పండ్లను మధుమేహం ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. మరి ఆ పండ్లు ఏవి? వాటి ఉపయోగలేమిటో తెలుసుకుందామా?

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ అంటే..? మనం తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్‌ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. అలా రక్తంలో చక్కెర స్థాయి ఎంతమేర పెరుగుతుందో తెలిపే కొలమానాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్‌ అంటారు. తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి 55కు మించకుండా ఉండే తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ అని, 56-69 మధ్య ఉంటే మధ్యస్థ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ అని, 70కి మించి ఉంటే అధిక గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ అని అంటారు. మధుమేహం ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న పండ్లను ఎక్కువగా తినాలి. మధ్యస్థ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న పండ్లను తక్కువగా తింటే మంచిది.

దానిమ్మ

దానిమ్మ పండ్లలో కార్బోహైడ్రేట్స్‌ ఉన్నప్పటికీ చక్కెరస్థాయి చాలా తక్కువగా ఉంటుంది. వీటి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కేవలం 18 మాత్రమే. కాబట్టి దానిమ్మ పండ్లను మధుమేహులు ఎలాంటి ఆలోచన లేకుండా తినొచ్చు. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ యాక్సిడెంట్లు కణాలను నాశనం చేసే ప్రమాదకర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడంతోపాటు కొవ్వు స్థాయిలను సైతం తగ్గిస్తాయి. దానిమ్మలో పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి.

యాపిల్స్‌ 

రోజుకో యాపిల్‌ తింటే వైద్యుల అవసరం రాదు అని నానుడి. వీటిలో విటమిన్‌ సి, పీచు, యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. యాపిల్‌లో ఉండే పీచు, పాలీఫినోల్స్‌.. కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గిస్తాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిలువరిస్తాయి. యాపిల్‌లో చక్కెర ఉంటుంది. అయితే, అది ఫ్రక్టోస్‌ రూపంలో ఉంటుంది. ఈ ఫ్రక్టోస్‌ రక్తంలోని చక్కెర స్థాయిపై పెద్దగా ప్రభావం చూపదు. యాపిల్‌ ఇన్సులిన్‌ నిరోధకతను తగ్గిస్తుంది. దీంతో చక్కెరస్థాయి పెరగకుండా ఉంటుంది. యాపిల్‌ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 36గా ఉంటుంది కాబట్టి.. మధుమేహంతో బాధపడుతున్న వారు వీటిని తినొచ్చు.

స్ట్రాబెర్రీ

ఈ పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర చేరే ప్రక్రియ నిదానంగా జరుగుతుంది. ఒకేసారి చక్కెర స్థాయి పెరగకుండా నిలువరిస్తుంది. అలాగే ఈ స్ట్రాబెర్రీలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. జీవ్రక్రియను మెరుగుపర్చడంతోపాటు క్యాన్సర్‌తో పోరాడే శక్తినిస్తాయి. బరువు తగ్గడంలోనూ ఈ పండ్లు సహాయపడతాయి. వీటి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 46గా ఉంటుంది.

జామకాయ

జామకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను బాగా తగ్గించగలవు. ఇందులో ఉండే పీచు చక్కెర శోషణను నియంత్రిస్తూ రక్తంలో చక్కెరస్థాయిని పెరగనివ్వదు. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారికి ఈ పండ్లు పెద్ద సహాయం చేస్తాయనడంలో సందేహం లేదు. దీని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 12 మాత్రమే. వీటిలో సోడియం శాతం తక్కువగా.. పోటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి మేలు చేస్తాయి.

ద్రాక్ష

ద్రాక్షపండ్ల గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 53-59గా ఉంటుంది. ఇది అటు ఇటుగా మధ్యస్థ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌. కానీ, రక్తంలో చక్కెరస్థాయిని ద్రాక్ష పండ్లు తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిస్ సీ, రెస్వెరాట్రోల్‌ అనే రసాయనం ఇన్సులిన్‌ పనితీరును మెరుగుపర్చి గ్లూకోజ్‌ను సరిగా వినియోగించడంలో సహాయపడతాయి. గ్లూకోజ్‌ రిసెప్టార్లను పెంచుతాయి. తద్వారా రక్తంలో చక్కెర నిల్వకాకుండా చూస్తాయి.

బత్తాయి

బత్తాయిలో విటమిస్‌ సీ, పీచు, ఫోలెట్‌, పోటాషియమ్‌ మెండుగా ఉంటాయి. బత్తాయి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 40-43గా ఉంటుంది. వీటిలో చక్కెర ఉంటుందని భయపడొద్దు. బత్తాయిలో పీచు అధికమొత్తంలో ఉండటం వల్ల వీటిని తిన్నా నెమ్మదిగా జీర్ణమై.. రక్తంలో కలవడానికి చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి.. బత్తాయిలో ఉండే చక్కెర రక్తంలోని చక్కెరస్థాయిపై ప్రభావం చూపదు. అయితే, ఒక్క విషయం మర్చిపోవద్దు. బయట లభించే కృత్రిమ బత్తాయి రసాలు తాగడం వల్ల చక్కెరస్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే వాటిల్లో పంచదార కలుపుతుంటారు. అవి నేరుగా రక్తంలో చేరి మధుమేహాన్ని పెంచుతాయి. కాబట్టి కేవలం బత్తాయి పండ్లను తినండి.. లేవి ఇంట్లో తయారు చేసిన రసాన్ని తాగండి.

బొప్పాయి

ఈ పండ్లలో యాంటీ యాక్సిడెంట్స్‌, పీచు ఎక్కువగా ఉంటాయి. పీచు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిండంలో.. యాంటీ యాక్సిడెంట్లు కణాలు దెబ్బకుండా.. ప్రమాదకర ఫ్రీరాడికల్స్‌ను శరీరం నుంచి బయటకు పంపడానికి సహాయపడతాయి. మధుమేహం వల్ల ఏర్పడే గుండె, నరాల సమస్యలను బొప్పాయి అడ్డుకుంటుంది. మధుమేహ రోగులు బొప్పాయిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ మధ్యస్థంగా ఉంటుంది. ఈ పండ్లలో చక్కెర ఫ్రక్టోస్‌ రూపంలో ఉంటుంది. కాబట్టి సమస్య ఉండదు.

పుచ్చకాయ

పుచ్చకాయలో దాదాపు 80శాతం నీరే ఉంటుంది. కానీ, పోటాషియం, లైకోపీన్‌ అనే మూలకం ఎక్కువగా ఉంటాయి. మధుమేహం కారణంగా నరాలను దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ పుచ్చకాయలో ఉండే లైకోపీన్‌ అనే మూలకం నరాలు దెబ్బతినకుండా నివారించడంలో దోహదపడతుంది. కిడ్నీల సరిగా పనిచేయాలంటే ఈ పోటాషియం ఎంతో అవసరం. నిజానికి పుచ్చకాయ గ్లైసమిక్‌ ఇండెక్స్‌ అధికంగా(76)ఉంటుంది. కాబట్టి.. తక్కువ మొత్తంలో పుచ్చకాయను తినడం ఉత్తమం. 

వీటితోపాటు నేరేడు, అంజీరా, చెర్రీ పండ్లు కూడా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరస్థాయిలను తగ్గిస్తూ.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని