Updated : 24 Nov 2020 17:27 IST

గదిలో బందిస్తే.. జాతీయగీతం బయటకొచ్చింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి దేశానికి ఒక జాతీయ గీతం ఉంటుంది. మన దేశ జాతీయ గీతం ‘జనగణమన’ను రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన విషయం అందరికీ తెలిసిందే. అన్ని దేశాలు వాటి ప్రత్యేకతలను, ప్రాముఖ్యతను తెలపడం కోసం జాతీయగీతాన్ని రూపొందిస్తుంటాయి. అయితే, జాతీయ గీతం రూపకల్పన వెనుక జరిగే విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదు. మెక్సికో.. ‘మెక్సికానొస్‌, అల్‌ గ్రిటో డే గారా’ను 1854లో జాతీయ గీతంగా అధికారికంగా ప్రకటించింది. ఈ జాతీయ గీతాన్ని ఫ్రాన్సిస్కో గొంజాలెజ్‌ బొకనేగ్రా అనే కవి రచించాడు. ఆయన రచన వెనుక ఆసక్తికర ఘటన ఉంది. 

మెక్సికో దేశానికి 1810లోనే స్పెయిన్‌ నుంచి విముక్తి లభించింది. అయితే స్వతంత్రదేశంగా ఏర్పడటానికి మరో పద్నాలుగేళ్లు పట్టింది. ఆ తర్వాత అనేక మంది నేతలు దేశాధ్యక్షులుగా పనిచేశారు. వారిలో ఒకరైన ఆంటోనియో లోపెజ్‌ డి సాంటా అన్నా 22 ఏళ్లలో 12 సార్లు అధ్యక్ష పదవిలో ఉన్నారు. చివరగా 1853-55 కాలంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు తన దేశానికి జాతీయ గీతం ఉంటే బాగుంటుందని భావించారు. దీంతో 1853 నవంబర్‌ 12న బహిరంగ పోటీ నిర్వహించారు. ఎవరైతే జాతీయత ప్రతిబింబించేలా జాతీయగీతానికి సాహిత్యం రాస్తారో వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించారు. చాలా మంది సాహిత్య రచనకు దిగారు. కానీ, ఆ దేశంలోని ప్రముఖ రచయిత ఫ్రాన్సిస్కో గొంజాలెజ్‌ బొకనేగ్రా ఈ పోటీపై ఆసక్తి కనబర్చలేదు. అందరూ ఈ పోటీలో పాల్గొనమని చెప్పినా.. ప్రేమ కవితలు రాయడానికి, జాతీయ గీతం రాయడానికి చాలా తేడా ఉందని, తాను రాయబోనని స్పష్టం చేశాడు.

గదిలో పెట్టి తాళం వేసి..

ఫ్రాన్సిస్కోకు ఆ సమయంలోనే వివాహం నిశ్చయమైంది. ఆయన కాబోయే భార్య గ్వాడాలుపె గొంజాలెజ్‌ డెల్‌పినో కూడా ఫ్రాన్సిస్కోని జాతీయ గీతం రాయమని బతిమిలాడిందట. ఎంతకీ మాట వినకపోవడంతో డెల్‌పినో అతడిని తన ఇంట్లో ఉన్న ఒక పడకగదిలోకి నెట్టేసి తాళం వేసింది. జాతీయగీతం కోసం సాహిత్యం రాసే వరకు తాళం తీయనని తెగేసిచెప్పింది. బందిగా మారిన ఫ్రాన్సిస్కో తన కలానికి పని చెప్పక తప్పలేదు. గదిలో ఉన్న మెక్సికో చరిత్రకు సంబంధించిన వివిధ ఫొటోలను చూసిన ఆయన వాటి స్ఫూర్తితో నాలుగు గంటల్లో పది చరణాలతో కూడిన ఒక జాతీయగీతాన్ని రచించి పోటీ నిర్వాహకులకు పంపించాడు. ఫ్రాన్సిస్కో రచనే ఏకగ్రీవంగా జాతీయ గీతంగా ఎంపికైయ్యాయి. 1854 ఫిబ్రవరి 3న అతడిని విజేతగా ప్రకటించారు. ఆ సాహిత్యానికి జైమె నునొ అనే సంగీత కళాకారుడి సంగీతం తోడైంది. దీంతో 1854 సెప్టెంబర్‌ 16న సంగీతంతో కూడిన జాతీయ గీతాన్ని ఆవిష్కరించారు. 

జాతీయ గీతంలో మార్పులు

1943 నుంచి మెక్సికో జాతీయ గీతంలో కొన్ని మార్పులు చేశారు. ఫ్రాన్సిస్కో రాసిన సాహిత్యంలో పల్లవి.. 1,5,6,10 చరణాలు మాత్రమే ప్రస్తుత జాతీయగీతంలో ఉన్నాయి. అప్పటి దేశాధ్యక్షుడు మాన్యువల్‌ అవిలా కామకొ ఆదేశాల మేరకు ఈ మార్పులు జరిగాయి. ఇది కాకుండా క్రీడా కార్యక్రమాల్లో జాతీయ గీతం పాడాల్సి వచ్చినప్పుడు పల్లవి, మొదటి చరణం, పల్లవి పాడతారు. టీవీ, రేడియో ప్రసారాల్లో వినిపించే జాతీయగీతంలో పల్లవి, మొదటి చరణం, పల్లవి, పదో చరణం, పల్లవి వాడతారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని