విశాఖ నుంచి భోగాపురం వరకు.. గ్రీన్‌బెల్ట్‌

విశాఖ నగరం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిపాదించిన ఆరు వరుసల రోడ్డులో గ్రీన్‌బెల్టు రానుంది.

Updated : 22 Mar 2023 06:39 IST

గ్రీన్‌బెల్టు రానున్న బీచ్‌రోడ్డు

న్యూస్‌టుడే, తగరపువలస, గ్రామీణభీమిలి

విశాఖ నగరం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిపాదించిన ఆరు వరుసల రోడ్డులో గ్రీన్‌బెల్టు రానుంది. విశాఖ కైలాసగిరి నుంచి భీమిలి మీదుగా భోగాపురం విమానాశ్రయం వరకూ దీన్ని అభివృద్ధి చేయనున్నారు.

రోడ్డుకు ఇరువైపులా 10 మీటర్లు (32.80 అడుగులు) మేర స్థలాన్ని గ్రీన్‌ బెల్టు కోసం సేకరించనున్నారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ పురపాలక పట్టణాభివృద్ధిశాఖ తాజాగా ఈ ప్రతిపాదన చేసింది.

ఈ గ్రామాలపై ప్రభావం: కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ రోడ్డుకు ఇరువైపులా ప్రతిపాదిత గ్రీన్‌బెల్టులోకి వచ్చే ప్రయివేటు స్థలాలు, ఇళ్లను వీఎంఆర్‌డీఏకి అప్పగించాల్సి ఉంటుంది. బాధితులకు టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫరబుల్‌ డవలప్‌మెంట్‌ రైట్‌) ఇవ్వనున్నారు. బీచ్‌ కారిడార్‌ ప్రణాళికలో భాగంగా గ్రీన్‌బెల్టును అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

* జోడుగుళ్లపాలెం, మంగమారిపేట, పుక్కెళ్లపాలెం, భీమునిపట్నంలో రోడ్డుకు ఆనుకుని ప్రయివేటు నివాసాలు, ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన గృహాలు ఉన్నాయి. సాగర్‌నగర్‌, ఎండాడ, రుషికొండ, తిమ్మాపురం, చేపలుప్పాడ, నేరేళ్లవలస, భీమిలి, బ్యాంకుకాలనీ, మూలకుద్దు, నాగమయ్యపాలెం, అన్నవరం(విశాఖ జిల్లా) తో పాటు అటు తూడెం, దిబ్బలపాలెం, చేపల కంచేరు(విజయనగరం జిల్లా)ల్లో ప్రయివేటు స్థలాలు ఉన్నాయి. దాదాపు 45 కిమీ మేర ఇరువైపులా పది మీటర్లు చొప్పున స్థలాలను సేకరించనున్నారు.

వీటికి మినహాయింపు..: గ్రీన్‌బెల్టు నుంచి తూర్పు నావికాదళ స్థావరమైన ఐఎన్‌ఎస్‌ కళింగ, దీనికి భీమిలికి మధ్య విస్తరించి ఉన్న ఎర్రమట్టి దిబ్బలు, అటవీశాఖకు చెందిన భూములు, జల వనరులు, కొండలకు మినహాయింపు ఇచ్చారు. మిగిలిన ప్రయివేటు భూములు, ఆస్తులను సేకరిస్తారు. ఈ మేరకు సవరించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలుంటే 15రోజుల్లోగా గుంటూరు జిల్లా అమరావతి వద్దనున్న రాష్ట్ర సచివాలయంలోని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి తెలపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.


రోడ్డు: విశాఖ కైలాసగిరి-భోగాపురం విమానాశ్రయం


పొడవు-: 45 కిమీ (సుమారు), వెడల్పు: 6 వరుసలు


గ్రీన్‌బెల్టు అభివృద్ధి చేయనున్న ప్రాంతం: రోడ్డుకు ఇరువైపులా 10మీటర్ల చొప్పున


అవసరమైన భూమి: సుమారు 50-60 ఎకరాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని