త్వరలో విశ్వగురువుగా భారత దేశం

లక్షలాది మంది పేదల ఆకలి తీర్చిన గొప్ప మాతృమూర్తి జిల్లెళ్లమూడి అమ్మ అని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు. బాపట్ల మండలం జిల్లెళ్లమూడిలో అమ్మ శత జయంత్యుత్సవాల రెండోరోజు బుధవారం

Updated : 30 Mar 2023 06:55 IST

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

అమ్మతో అనుభవాలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్‌ దత్తాత్రేయ, చిత్రంలో నన్నపనేని రాజకుమారి తదితరులు

బాపట్ల, న్యూస్‌టుడే: లక్షలాది మంది పేదల ఆకలి తీర్చిన గొప్ప మాతృమూర్తి జిల్లెళ్లమూడి అమ్మ అని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు. బాపట్ల మండలం జిల్లెళ్లమూడిలో అమ్మ శత జయంత్యుత్సవాల రెండోరోజు బుధవారం నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. అమ్మ జీవితమే గొప్ప ఆధ్యాత్మిక సందేశమన్నారు. మారుమూల గ్రామమైన జిల్లెళ్లమూడిలో అమ్మ సర్ణోత్సవాల సందర్భంగా ఒకే రోజు లక్ష మందికి భోజనం వడ్డించి ఆకలి తీర్చటం ద్వారా ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణాలయంగా, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారన్నారు. అమ్మ ప్రేరణతో విశ్వజననీ పరిషత్‌ ట్రస్టు ద్వారా భక్తులు గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈర్ష్య, అసూయ, ద్వేషం సమాజ వినాశనానికి దారి తీస్తుందన్నారు. ఇవి రాజకీయ రంగంలో ఎక్కువయ్యాయన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను భారతదేశం ఇచ్చిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశం త్వరలో విశ్వగురు స్థానానికి చేరుకుంటుందన్నారు. రచయిత రావూరి ప్రసాద్‌ రచించిన అమ్మతో అనుభవాలు పుస్తకాన్ని దత్తాత్రేయ ఆవిష్కరించారు. విశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌ మాట్లాడుతూ మేధాశక్తిని విశ్వ కల్యాణం, సమాజ వికాసం కోసం ఉపయోగించాలన్నారు. మానవత్వమే ప్రాణం, ఐకమత్యమే మహాబలం, ఇదే అమ్మ ఇచ్చిన విశ్వ సందేశమని పేర్కొన్నారు. విశ్వజనని దివ్య సంకల్పంతో జిల్లెళ్లమూడి అన్నపూర్ణాలయం నిరంతరాయంగా పేదల ఆకలి తీరుస్తోందన్నారు. ఆధ్యాత్మికతకు కుటుంబ జీవనం అడ్డుకాదన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అమ్మ ప్రేమతత్వాన్ని పంచారని, ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి ఇది చాలా అవసరమన్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ మూర్తీభవించిన గొప్ప మాతృమూర్తి, మానవత్వానికి ప్రతీక జిల్లెళ్లమూడి అమ్మ అని పేర్కొన్నారు. రచయిత ప్రసాదవర్మ రచించిన అమ్మ తత్వ చింతన ప్రస్తానం పుస్తకాన్ని విశ్వయోగి విశ్వంజీ ఆవిష్కరించారు. విశ్వజననీ పరిషత్‌ ట్రస్టు ఛైర్మన్‌ కుమ్మమూరు నరసింహమూర్తి, ఆచార్యులు నారాయణం శేషుబాబు, మాతృశ్రీ ఓరియంటల్‌ కళాశాల కరస్పాండెంట్ బీఎల్‌ సుగుణ, రచయిత రావూరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అమ్మకు ప్రత్యేక పూజలు

జిలెళ్లమూడి అమ్మ ఆలయంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రత్యేక పూజలు చేశారు.  అన్నపూర్ణాలయంలో అన్నప్రసాదం స్వీకరించారు. జిల్లెళ్లమూడి విచ్చేసిన హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు అదనపు ఎస్పీ మహేష్‌, ఆర్డీవో రవీందర్‌, డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్లు కవిత, కేశవ నారాయణ స్వాగతం పలికారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని