కాగ్ కడిగి పారేసింది!
ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలను కాగ్ కడిగి పారేసింది. ప్రత్యేకించి కరోనా సమయంలో అమలు తీరును ఎండగట్టింది. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, సేవలు, సంక్షేమ పథకాల అమలుపై కాగ్ తనిఖీ నివేదికను విడుదల చేసింది.
కరోనా సమయంలో మధ్యాహ్న భోజనంలో అక్రమాలు
సరకుల పంపిణీలో లెక్కల్లేవని తీవ్ర అభ్యంతరాలు
సరైన ఆడిటింగ్ వ్యవస్థే లేదంటూ ఘాటుగా విమర్శలు
ఈనాడు, కడప
మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు
ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలను కాగ్ కడిగి పారేసింది. ప్రత్యేకించి కరోనా సమయంలో అమలు తీరును ఎండగట్టింది. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, సేవలు, సంక్షేమ పథకాల అమలుపై కాగ్ తనిఖీ నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలోని కర్నూలు, శ్రీకాకుళంతో పాటు ఉమ్మడి కడప జిల్లాలో పరిశీలన చేపట్టినట్లు నివేదికలో పేర్కొంది. కొవిడ్-19 సమయంలో పొడి రేషన్ పంపిణీలో పలు అక్రమాలు జరిగినట్లు వివరించింది. కేంద్ర ప్రయోజిత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదార్థాల జాబితాతో ‘జగనన్న గోరుముద్ద’గా పేరు మార్పు చేసినట్లు తెలిపింది.
కొవిడ్ మహమ్మారి విజృంభించడంతో 2020, మార్చి 19వ తేదీ నుంచి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని నెలల పాటు పాఠశాలల మూసివేతతో వండిన భోజనం పంపిణీ కాలేదు. ఈ తరుణంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ స్పందించింది. కొవిడ్‌తో పాఠశాలలు మూసివేసినన్ని రోజులు విద్యార్థులకు వేడిగా వండిన మధ్యాహ్న భోజనం లేదా ఆహార భద్రత భత్యం ఏది వీలైతే అది పంపిణీ చేయాలని ఆదేశించింది. నమోదైన విద్యార్థులు, పాఠశాల మూసివేసినంత కాలం, పాఠశాల పనిదినాలను లెక్కించుకుని బియ్యం, కోడిగుడ్లు, చిక్కీలు పంపిణీ చేయాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. వంట ఖర్చులకు బదులుగా కనీసం కందిపప్పును పొడి రేషన్‌తో పాటు పంపిణీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఎంపిక చేసుకున్న పరిశీలన విధానంలో కోడిగుడ్లు పంపిణీకి సంబంధించి సరైన ఆడిటింగ్ వ్యవస్థ లేదని తప్పుబట్టింది. గుడ్లు పంపిణీ మూడు నుంచి 105 రోజులు ఆలస్యంగా జరిగినప్పటికీ ఒప్పందం మేరకు సరఫరాదారుపై జరిమానా, జరిగిన నష్టాన్ని వసూలు చేయలేదని వివరించింది. చిక్కీల సరఫరాలో జాప్యానికి రోజుకు ఒక శాతం చొప్పున జరిమానా విధించాలనే ఒప్పందం జరిగింది. ఈ మేరకు రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, నిర్వహించినా 96 రోజులు ఆలస్యంగా సరఫరాకు జరిమానాలు విధించలేదని గుర్తించినట్లు తెలిపింది. ఉమ్మడి కడప జిల్లాలో పరిశీలించిన కొన్ని పాఠశాలల్లో గుడ్లు 41 నుంచి 100 వరకు, చిక్కీలు 26 రోజులు ఆలస్యంగా సరఫరా అయినట్లు రికార్డుల ద్వారా తెలిసినట్లు వివరించింది. వల్లూరు మండలంలో గుడ్లు, చిక్కీలు తక్కువగా పంపిణీ జరిగినట్లు పరిశీలనలో తేలినట్లు పేర్కొంది. అయిదు వసతి గృహాలను పరిశీలించగా, 1,801 మంది విద్యార్థులకు గుడ్లు, చిక్కీలు అందలేదని, కడప మండలంలో పొడి రేషన్ పంపిణీ వివరాలు సక్రమంగా లేవని వివరించింది. వల్లూరు, అట్లూరు, చెన్నూరు, సిద్దవటం మండలాల్లో పరిశీలించినట్లు నమోదు చేసింది. పాఠశాలల్లో బియ్యం, ఇతర సరకుల కొనుగోలుకు తూనిక యంత్రాలు అందుబాటులో లేవని, తద్వారా పారదర్శకత కొరవడినట్లు పేర్కొంది. ఒప్పందం మేరకు గుడ్డు బరువు 50 గ్రాములు, గుడ్డు పెంకు శుభ్రంగా, విరగ కుండా, సహజంగా, పెంకు మందం 0.33 ఎంఎం ఉండాలని.. ఈ మేరకు నాణ్యత ప్రమాణాలు, నియమాలు పాటించినట్లు ఆధారాల్లేవని పేర్కొంది.
కీలక లోపాలు ఇవంటూ...
పాఠశాలల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శన, రేషన్ పంపిణీ చిత్రాలు, తల్లిదండ్రుల సంఘం సమావేశాలు నిర్వహించిన దాఖలాల్లేవని తెలిపింది. డీఈవోలు, ఎంఈవోలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమయపాలన, నిర్దిష్ట మార్గదర్శకాలు పాటించకపోవడంతో కరోనా మహమ్మారి కాలంలో అర్హత ఉన్న విద్యార్ధులందరికీ పొడి రేషన్ సరఫరా, పంపిణీ ఆలస్యానికి దారి తీసినట్లు పేర్కొంది. పంపిణీ, సరఫరా, నాణ్యత నిర్ధారించే కమిటీల ఏర్పాటు జరగలేదని, పర్యవేక్షణ యంత్రాంగం సక్రమంగా పనిచేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో చర్యలు చేపట్టకపోవడంతో పాఠశాల విద్యార్థులకు పౌష్ఠికాహారం సరఫరాలో జాప్యం జరిగిందని తప్పుబట్టింది. 100 రోజుల్లో సరఫరా చేయాల్సిన కందిపప్పు 9 నెలల ఆలస్యంగా ఏకమొత్తంగా ఒకేసారి సరఫరా చేశారంటూ తప్పుబట్టింది. సరఫరా, పంపిణీ దస్త్రాలు నిర్వహించకపోవడంతో అర్హత ప్రకారం విద్యార్థులు పొడి రేషన్ పొందినట్లు భరోసా లేదని తెలిపింది. ప్రభుత్వం ఆడిట్ ద్వారా బయటపడే లోపాలకు జవాబుదారీతనాన్ని నిర్ణయించాలని కాగ్ సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nagarjuna sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్దకు చేరుకొని ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేశారు. డ్యామ్‌పై విద్యుత్ సరఫరా నిలిపివేసి, అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్‌ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.