ఉత్తరాంధ్ర దోపిడీ.. వైకాపా నేతలకు కనిపించలేదా!!

Updated : 08 Dec 2023 05:55 IST

ఈ ప్రాంతంపై అభిమానముంటే స్పందించరెందుకు
ఇక్కడి నుంచి వలసల నిరోధమే లక్ష్యం
‘ఉక్కు’ పరిరక్షణ పోరాటంలో నేను ముందుంటా
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో వేలాది మంది మృత్యువాత పడుతుంటే జనసేన అండగా నిలిచే వరకు విజయనగరం, శ్రీకాకుళం నాయకులు ఎక్కడికి వెళ్లారు?’

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఈనాడు-విశాఖపట్నం, ఎంవీపీకాలనీ-న్యూస్‌టుడే : ‘ఉత్తరాంధ్ర అంటే చైతన్యం నిండిన నేల. తెలుగువాడిలో ఆంధ్ర అనే భావన రగిలించిన నేల. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినదించిన నేల. ఇలాంటి ప్రాంత ప్రజలు, యువత జీవనోపాధికి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం బాధ కల్గిస్తోంది. యువతకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, ఉత్తరాంధ్రలో వలసల నిరోధమే లక్ష్యంగా పనిచేస్తా’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

గురువారం ఎ.ఎస్‌ రాజా గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో  పవన్‌ మాట్లాడారు. ‘రాజధాని అంశం చర్చకు వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్ర మీద ప్రేమ, మమకారం లేదా? ఈ ప్రాంతానికి రాజధాని రావడం ఇష్టం లేదా? అంటూ వైకాపా నాయకులు నన్ను ప్రశ్నిస్తుంటారు. కబ్జాలతో, అక్రమాలతో ఉత్తరాంధ్ర దోపిడీకి గురవుతుంటే ఇక్కడి వైకాపా నాయకులు ఏం చేస్తున్నారు? వైకాపాకు 151 సీట్లు ఇస్తే.. జాబ్‌క్యాలెండర్‌ కూడా ఇవ్వలేదు’ అని పవన్‌  ధ్వజమెత్తారు. మహిళలపై దాడుల్లో రాష్ట్రం 6వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో తెదేపా-జనసేన అభ్యర్థులను గెలిపించుకుని  వైకాపా విముక్తి ప్రాంతంగా ఉత్తరాంధ్రను ప్రకటిద్దామన్నారు. పాదయాత్రలో సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే వైకాపా మర్చిపోయిందని, సీపీఎస్‌ తిరిగి తచ్చే ప్రయత్నం జనసేన చేస్తుందని పేర్కొన్నారు.

జనం అండగా ఉంటే చాలు..

విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం ప్రకటించగానే దిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడా. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్లాంటుల్లా విశాఖను చూడొద్దని, ప్రతి తెలుగువాడి భావోద్వేగంతో కూడుకున్నదని అమిత్‌షాకు వివరించా. జై తెలంగాణ నినాదానికి ఎంత ఉద్వేగం ఉంటుందో...విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్న నినాదానికి అంతే ఉద్వేగం ఉంటుందని చెప్పా. ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణంగా అండగా నిలబడితే విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ చేయకుండా బలమైన పోరాటం నేను ముందుండి చేస్తా’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

దాదాపు 30వేల మంది మహిళలు, యువతులు రాష్ట్రంలో అదృశ్యమయ్యారు. దీనిపై ముఖ్యమంత్రి, మంత్రులు ఏ ఒక్కరూ ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడలేదు. విశాఖలో జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం నిర్వహిస్తే అనకాపల్లికి చెందిన ఒకరు తన కుమార్తె అదృశ్యమై రెండేళ్లు అయిందని  విలపించారు. నిజంగా ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఇలాంటివాటిపై వైకాపా నేతలు ఎందుకు స్పందించరు’ అని పవన్‌ ప్రశ్నించారు.

ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిస్తాం: ‘2019లో గాజువాకలో ఓడిపోయిన తరువాత భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ముందుకొస్తే 2లక్షల మంది రోడ్డుపైకి వచ్చారు. ఆ ప్రేమకు నా కళ్లు చెమర్చాయి. ఉత్తరాంధ్ర ఇచ్చిన ధైర్యమే నన్ను రాజకీయాల్లో నిలబెట్టింది. ఆ ధైర్యమే జగన్‌ను ఎదుర్కొనేలా చేసింది. ఆ ధైర్యమే కిరాయి గూండాలతో పోరాడేలా చేసింది. ఆ ధైర్యమే 2024లో జనసేన-తెదేపా ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. మీ భవిష్యత్‌ను బంగారుమయం చూస్తుంది. ప్రజాప్రభుత్వం ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాం’ అని పవన్‌ పేర్కొన్నారు.

జగన్‌ తప్పులతో పంచాయతీ నిధులకు మంగళం: ‘పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులను వైకాపా కొల్లగొట్టింది. ఈ ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.3,359కోట్లు నిలిపివేసింది. గ్రామ సచివాలయాల పేరుతో పంచాయతీల అధికారాన్ని వైకాపా నిర్వీర్యం చేసే కుట్ర చేసింది. పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని వ్యవస్థలను, వ్యక్తుల జీవితాలను వైకాపా ధ్వంసం చేస్తోంది.నేను పార్టీ పెడతానని, ఒక పదవి కోసం పాకులాడాలని ఎప్పుడూ ఆలోచించలేదు. భావి తరాల భవిష్యత్తుకు ఏం చేయాలని మాత్రమే ఆలోచించా’నని పవన్‌ అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యులు కోన తాతారావు, పడాల అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివశంకర్‌, బొలిశెట్టి సత్య, యశస్వి, విశాఖ గ్రామీణ జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబు, అధికార ప్రతినిధులు సుందరపు విజయ్‌కుమార్‌, పరుచూరి భాస్కరరావు, పార్టీ నేతలు రాజు, పంచకర్ల సందీప్‌, పసుపులేటి ఉషాకిరణ్‌, మూగి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌:  అప్పుల ఆంధ్రాలో రూ.451 కోట్లతో విశాఖలో క్యాంప్‌ కార్యాలయం పేరుతో వైకాపా నాయకులు చేస్తున్న హడావిడిని ప్రజలు అర్థం చేసుకోవాలి. విశాఖను కబ్జాల కేంద్రంగా వైకాపా మార్చింది. విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరిట రూ.400 కోట్ల ప్రజాధనం వృథా చేశారు.

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు: రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయని జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోబోతున్నారు. తెదేపా, జనసేన సంయుక్త పాలనలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి బాటలో నడుస్తుంది.

సుందరపు వెంకట సతీష్‌కుమార్‌ను జనసేనలోకి ఆహ్వానిస్తున్న పవన్‌ కల్యాణ్‌

అభిమానుల కోలాహలం

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

విమానాశ్రయంలో అభిమానులతో పవన్‌ స్వీయచిత్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని