Telangana news: ఉచిత ప్రయాణానికి ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాలుగైదు నెలల్లో దాదాపు 2,050 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

Updated : 21 Dec 2023 07:48 IST

మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సూచన
నాలుగైదు నెలల్లో 2,050 కొత్త బస్సులొస్తాయని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాలుగైదు నెలల్లో దాదాపు 2,050 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. అందులో 1,050 డీజిల్‌, 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు ఉంటాయన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణం పథకానికి భారీ స్పందన వస్తోందన్నారు. ఆ వివరాలను బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉచిత ప్రయాణానికి అర్హులైనవారు తమ ప్రయాణ సమయంలో ఫొటో స్పష్టంగా కనిపించే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్లలో గుర్తింపు కార్డుల సాఫ్ట్‌ కాపీలు చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని ఆయన స్పష్టంచేశారు. బస్సుల్లో ఫుట్‌ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్‌ పైకెక్కి ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించడం సరికాదన్నారు. ‘పథకం 9వ తేదీ నుంచి అమల్లోకి రాగా 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. రోజుకు సగటున 51 లక్షల మంది ప్రయాణిస్తుండగా ఇందులో 30 లక్షల మంది మహిళలే. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారు. ఇదే సమయంలో బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఓఆర్‌) భారీగా పెరిగింది. గతంలో 69 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతమైంది. 16వ తేదీన 17 బస్‌ డిపోలు, 17న 20 డిపోలు, 18న 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్‌ నమోదైంది. యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, హుజూరాబాద్‌, మేడ్చల్‌, ముషీరాబాద్‌, మియాపూర్‌-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు గత మూడు రోజులు 100 శాతం ఓఆర్‌ సాధించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని