వైద్యుడిపై చేయి చేసుకున్న మహిళ

వైద్యుడిపై ఓ మహిళ చేయి చేసుకున్న ఘటన మంగళవారం చర్చనీయాంశమైంది..

Updated : 31 Jan 2024 10:39 IST

డాక్టర్‌ రష్మికాంత్‌ మిశ్రాను చెప్పుతో కొడుతున్న సుజ్ఞాని

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రష్మికాంత్‌ మిశ్రాపై ఓ మహిళ చేయి చేసుకున్న ఘటన మంగళవారం చర్చనీయాంశమైంది. రోగులను పరీక్షిస్తున్న సమయంలో మహిళ అక్కడికి చేరుకొని, ఏడాది కిందట తన కుమార్తె శవ పరీక్ష నివేదిక తప్పుగా ఇచ్చారని చెప్పుతో కొట్టినట్లు బాధిత వైద్యుడు వాపోయారు. చరవాణి లాక్కొని నేలకేసి కొట్టిందని వాపోయారు. దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ జిల్లా అదనపు వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ పండాను సంప్రదించగా ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, వైద్య బృందంతో సమావేశం ఏర్పాటుచేసి చర్చించి, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళ గతేడాది మృతి చెందిన నవోదయ విద్యార్థిని సౌధామిని తల్లి సుజ్ఞాని గమాంగ్‌గా తెలిసింది. అప్పట్లో తన కుమార్తెను హతామార్చారంటూ ఈమె నిరసనకు దిగింది. కానీ పోస్టుమార్టం చేసిన రష్మికాంత్‌ మిశ్రా ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక ఇచ్చారు. దీంతో తప్పుగా నివేదిక ఇచ్చారన్న ఆగ్రహంతో డాక్టరుపై చేయిచేసుకుంది. ఈ ఘటనపై బాధిత వైద్యుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సందీప్‌ హేంబ్రం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని