TSPSC: గ్రూప్‌-1లో అదనపు ఖాళీలెన్ని..?వివరాలు తీసుకుంటున్న ఆర్థికశాఖ

గ్రూప్‌-1 కేటగిరీ ఉద్యోగాల భర్తీపై కసరత్తు మొదలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

Updated : 01 Feb 2024 10:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 కేటగిరీ ఉద్యోగాల భర్తీపై కసరత్తు మొదలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు విభాగాల వారీగా అదనపు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టింది. 2022 జీవో నం.26 కింద గతంలోనే గుర్తించిన 503 గ్రూప్‌-1 ఉద్యోగాలకు అదనంగా ఖాళీల వివరాలు వెంటనే పంపించాలని ఇప్పటికే ఆదేశించింది. దీంతో ప్రభుత్వ విభాగాలు గత రెండేళ్లుగా అదనంగా ఏర్పడిన ఖాళీలు, మరో ఏడాదిలో పదవీ విరమణతో ఏర్పడే ఖాళీలు గుర్తించి ప్రభుత్వానికి పంపిస్తున్నాయి. మరికొన్ని విభాగాలు రెండు రోజుల సమయం కావాలని విజ్ఞప్తి చేశాయి. అదనంగా వచ్చే గ్రూప్‌-1 ఉద్యోగాల సంఖ్యపై వీలైనంత త్వరలో స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది.

రద్దు చేయాలా..? వేచి చూడాలా?

ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షపై సమాలోచనలు జరుగుతున్నాయి. రెండోసారి నిర్వహించిన పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, రద్దుచేసి మళ్లీ నిర్వహించాలంటూ ఇప్పటికే హైకోర్టు టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. ఈ తీర్పుపై కమిషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అది విచారణకు వచ్చి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో అని పరీక్ష రాసిన నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు గ్రూప్‌-1 పరీక్షపై ఎలా ముందుకు వెళ్లాలని కొత్తగా ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీ బోర్డు, ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష రద్దుచేసి ముందుకు వెళ్లాలా? లేదా తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలా? కొత్తగా గుర్తించే ఖాళీలతో తాజాగా మరో గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ వేయడమా? లేదా పాత నోటిఫికేషన్‌కు అనుబంధంగా చేర్చడమా? అనే విషయమై నిర్ణయం వెలువడాల్సి ఉంది. 2011లో ఇచ్చిన గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌పై న్యాయవివాదాలు తలెత్తడంతో తీవ్ర జాప్యం జరిగింది. ఆ నియామకాలు 2018లో పూర్తయ్యాయి. తాజాగా వివిధ విభాగాల్లోని అదనపు ఖాళీలు గుర్తించిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనల వివరాలను టీఎస్‌పీఎస్సీ రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్లు, సర్వీసు నిబంధనలు, విద్యార్హతలు అన్నీ పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్‌ ఇచ్చే విషయమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్‌-1 నుంచి కిందిస్థాయి వరకు కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే ఆయా ఖాళీల భర్తీకి ఎంత సమయం పడుతుంది? ప్రస్తుతం జారీ చేసిన వాటి నియామక ప్రక్రియ ఎంత వరకు వచ్చిందన్న విషయమై ఇప్పటికే నియామక సంస్థల నుంచి ప్రభుత్వం వివరాలు తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని