బూడిద తింటున్నాం.. తాగుతున్నాం.. చనిపోతున్నాం

బూడిద తింటూ, తాగుతూ వివిధ రకాల వ్యాధుల బారినపడి చనిపోతున్న వారి కుటుంబ సభ్యులకు ఎన్టీటీపీఎస్‌ యాజమాన్యం ఏం సమాధానం చెబుతుందని ‘కాలుష్య నియంత్రణ పోరాట సమితి’ సభ్యులు ప్రశ్నించారు.

Updated : 24 Feb 2024 09:24 IST

ఎన్టీటీపీఎస్‌ సీఈ నవీన్‌గౌతంను ప్రశ్నిస్తున్న కాలుష్య నియంత్రణ పోరాట సమితి సభ్యులు

కొండపల్లి, న్యూస్‌టుడే: బూడిద తింటూ, తాగుతూ వివిధ రకాల వ్యాధుల బారినపడి చనిపోతున్న వారి కుటుంబ సభ్యులకు ఎన్టీటీపీఎస్‌ యాజమాన్యం ఏం సమాధానం చెబుతుందని ‘కాలుష్య నియంత్రణ పోరాట సమితి’ సభ్యులు ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ఎ.కాలనీలోని ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లోని ఓ కార్యక్రమానికి శుక్రవారం వచ్చిన ఎన్టీటీపీఎస్‌ ముఖ్య ఇంజినీర్‌ నవీన్‌గౌతమ్‌ను కాలుష్య నియంత్రణ పోరాట సమితి సభ్యులు కలిసి నిలదీశారు. సంస్థ చిమ్నీల ద్వారా పురపాలిక వాసులపై వదులుతున్న బూడిదను ఎప్పుడు? ఎలా కట్టడి చేస్తారో చెప్పాలని కోరారు. బూడిద రవాణా వాహనాలతో రోడ్లపై పడుతున్న బూడిదతో కలుగుతున్న ఇబ్బందులు ఎప్పుడు తొలగిస్తారని మండిపడ్డారు. 800 మెగావాట్ల యూనిట్‌ నిర్మాణానికి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు అడిగిన డిమాండ్లను ఎందుకు నెరవేర్చ లేకపోయారో చెప్పాలన్నారు. 70 ఎకరాల్లో చేసిన గ్రీనరీని చూపాలని డిమాండు చేశారు. దీనిపై సీఈ, ఇతర అధికారులు సరైన జవాబు చెప్పకపోవడంతో డౌన్‌ డౌన్‌ ఎన్టీటీపీఎస్‌ యాజమాన్యం అంటూ నినాదాలు చేశారు. కొండపల్లి పురపాలిక, ఇబ్రహీంపట్నం మండల వాసుల ఆత్మ ఘోష వినాలని, వివిధ వ్యాధులతో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలన్నారు. జెన్‌కో ఎండీ కొండపల్లి వచ్చి బూడిదలో ప్రజలనుభవిస్తున్న బాధలు చూడాలని కోరారు. కాలుష్య నియంత్రణపై వారం రోజుల్లో యాజమాన్యం చేపట్టే చర్యలపై స్పష్టమైన విధానం ప్రకటించాలని, లేదంటే ఎన్టీటీపీఎస్‌ను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. అంతకుముందు సెక్యూరిటీ సిబ్బంది కాలుష్య నియంత్రణ పోరాట సమితి సభ్యులను అడ్డుకోవడంతో ఒకానొక సమయంలో ఉద్రిక్తత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని