వర్క్‌ఫ్రమ్‌ వైద్యాలయం

నగరంలో కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా.. స్వయంగా తానే డాక్టర్‌కు చూపించుకోవాలన్నా పనికి సెలవు పెట్టాల్సిందే.

Updated : 25 Feb 2024 06:50 IST

చికిత్స కోసం వచ్చే ఐటీ ఉద్యోగుల కోసం వర్క్‌ డెస్కులు
కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కొత్త సదుపాయాలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా.. స్వయంగా తానే డాక్టర్‌కు చూపించుకోవాలన్నా పనికి సెలవు పెట్టాల్సిందే. డాక్టర్‌ చూసేది కొద్దిసేపే అయినా అక్కడ గంటల తరబడి ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చోవాల్సిందే. అదే ఆసుపత్రిలోనే పనిచేసుకునేందుకు అవకాశం ఉంటే? ఈ రోజుల్లో ఎక్కువ మంది ల్యాప్‌టాప్‌పైనే పనిచేస్తున్నారు. వీరు ఎక్కడి నుంచైనా పనిచేయగలరు. కావాల్సిందల్లా ఒక డెస్క్‌, వైఫై అంతే. వృత్తి నిపుణులు, ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించిన కార్పొరేట్‌ ఆసుపత్రులు ఈ తరహా సౌకర్యాలు కల్పించడంలో ముందుంటున్నాయి.

అనారోగ్యం బాధిస్తున్నా సెలవు తీసుకోవడం కుదరక చాలామంది ఆసుపత్రికి వెళ్లడం వాయిదా వేస్తుంటారు. నగరంలో ఇది సహజమే అయినా వాయిదాలతో ఇంట్లో పెద్దవాళ్లు ముఖ్యంగా దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. పిల్లల పరిస్థితి చూసి వీరే సర్దుకుంటుంటారు. ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తున్న సదుపాయాలతో రోగులు, వారి సహాయకులు ముఖ్యంగా టెకీలకు కొంత వరకైనా ఉపయోగకరంగా ఉండనుంది. ఐటీ కారిడార్‌లోనే ఒక ఆసుపత్రి.. అక్కడికి వచ్చే రోగులు, వారి సహాయకులు ఎవరైనా పనిచేసుకునేందుకు ‘వర్క్‌ఫ్రమ్‌ ఆసుపత్రి’ సదుపాయాలు కల్పించింది. అక్కడ పనిచేసుకునేందుకు వీలుగా వర్క్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చినప్పుడు, అత్యవసర ఆన్‌లైన్‌ సమావేశానికి హాజరుకావడం, క్లయింట్‌తో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇతర ఆసుపత్రులు కూడా ఈ సౌకర్యాలు కల్పించడంలో పోటీపడుతున్నాయి.

మాదాపూర్‌లోని ఓ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన  డెస్కు

సానుకూల స్పందన..

ఐటీ కారిడార్‌లోని ఆసుపత్రులకు 80శాతం పైగా ఐటీ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులే వస్తుంటారు. వీరి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆసుపత్రిలోని వర్క్‌ డెస్క్‌ ఫొటోని ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా..నెటిజన్లలో ఎక్కువ మంది నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఛార్జింగ్‌ వంటి అదనపు సౌకర్యాల కోసం సూచనలు కూడా చేశారు. కొందరు మాత్రం ఇది మార్కెటింగ్‌ ఎత్తుగడగా కొట్టిపడేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని