విలేకరులకు తాయిలాలు

రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై వైకాపా నేతలు ఓ వైపు దాడులు చేస్తూనే మరో వైపు వారిని ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాల ఎర వేస్తున్నారు. పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలో శనివారం పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య పాల్గొన్నారు.

Updated : 25 Feb 2024 06:48 IST

వైకాపా నేతల జిమ్మిక్కులు

విలేకరులకు అందించిన దుస్తులు

పెదకాకాని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై వైకాపా నేతలు ఓ వైపు దాడులు చేస్తూనే మరో వైపు వారిని ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాల ఎర వేస్తున్నారు. పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలో శనివారం పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత స్థానిక విలేకరుల సంఖ్య అడిగి తెలుసుకొని గిఫ్టులు(దుస్తులు) ఇస్తామని చెప్పారు. ఈ బాధ్యతను ఆయన స్థానిక వైకాపా నేతలకు అప్పగించారు. మండల పార్టీ కార్యాలయంలో వారు విలేకరులను పిలిచి గిఫ్టులు అందజేశారు. నియోజకవర్గంలో ఏ సమావేశంలో పాల్గొన్నా ఎమ్మెల్యే రోశయ్య మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని బాహాటంగా ఆరోపిస్తూ పలు విమర్శలు చేస్తుంటారు. తాజాగా పెదకాకానిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా కొన్ని మీడియా సంస్థలపై విమర్శలు చేశారు. కొద్ది నిమిషాల్లోనే విలేకరులను ప్రసన్నం చేసుకోవటానికి తాయిలాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులను ప్రసన్నం చేసుకోకపోతే ఎమ్మెల్యే నెరవేర్చని హామీలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో గిఫ్టులు ఇస్తున్నట్లు కొందరు వైకాపా నాయకులు చెప్పారు. విలేకరులపై దాడి చేసిన సమయంలో నోరు మెదపని ఎమ్మెల్యే ప్రస్తుతం వారిని ప్రలోభాలకు గురి చేయాలని యత్నించడంపై ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు.

తెనాలిలోనూ..

అమరావతి:  తెనాలిలోనూ ప్రలోభాల పర్వం మొదలైంది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ గత కొద్ది రోజులుగా ఉదయం సమయంలో బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ ఎమ్మెల్యే పేరిట పట్టణంలోని కొన్ని వార్డులు, సాయంత్రం డిన్నర్‌ విత్‌ ఎమ్మెల్యే పేరిట గ్రామాలకు చెందిన వైకాపా నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. బుర్రిపాలెం రోడ్డులోని కళాశాల ప్రాంగణం ఇందుకు వేదికగా మారింది. ఈ క్రమంలో రెండు రోజుల కిందట  బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ ఎమ్మెల్యే కార్యక్రమం అనంతరం ఆయన పలువురు విలేకరులకు దుస్తులతో ఉన్న సంచులను బహుమతులుగా అందించారు. వాటిల్లో ఒక ఫ్యాంటు, షర్టు, చీర ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని