వాహనం అదుపు తప్పుతుంది!

కారు.. నేడు ప్రతి కుటుంబానికి అవసరంగా మారింది. కొవిడ్‌ తర్వాత నుంచి కార్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. వచ్చీ రాని డ్రైవింగ్‌ చేయటం, ఎక్కువ వేగంతో వెళ్లటం, నిర్లక్ష్యం.. వెరసి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.

Updated : 25 Feb 2024 07:19 IST

అతివేగం, నిర్లక్ష్యంతో  గాల్లో కలుస్తున్న ప్రాణాలు

భూత్పూర్‌ : అన్నాసాగర్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ధ్వంసమైన కారు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ నేరవిభాగం: కారు.. నేడు ప్రతి కుటుంబానికి అవసరంగా మారింది. కొవిడ్‌ తర్వాత నుంచి కార్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. వచ్చీ రాని డ్రైవింగ్‌ చేయటం, ఎక్కువ వేగంతో వెళ్లటం, నిర్లక్ష్యం.. వెరసి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారులు రక్తసిక్తమై ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో బాలానగర్‌ నుంచి అలంపూర్‌ వరకు ఎన్‌హెచ్‌ - 44, చారగొండ నుంచి కృష్ణా వరకు ఎన్‌హెచ్‌ - 167, ఆమనగల్‌ నుంచి అచ్చంపేట వరకు ఎన్‌హెచ్‌ - 765 విస్తరించి ఉన్నాయి. జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై గతేడాది 1,486 ప్రమాదాలు జరిగితే 749 మంది మృతిచెందారు. ఈ ఏడాది ఇప్పటికే 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

  •  ః ఈ నెల 21న భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను, తర్వాత చెట్టును ఢీకొట్టింది. కారులోని అనంతపురానికి చెందిన ఎస్సై వెంకటరమణ, నవ వరుడైన అతడి అల్లుడు, డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. నవ వధువైన కుమార్తె గాయాలతో బయటపడింది. అతి వేగమే వారి ప్రాణాలను బలితీసుకుంది.
  •  ఈ నెల 23న ఉదయం హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

    సూచికలు గమనించాలి..

రహదారిపై ఉన్న ట్రాఫిక్‌ చిహ్నాలు గమనిస్తుండాలి. ప్రాంతాన్ని బట్టి వాహనం వేగం ఉండేలా చూసుకోవాలి. వాహనాల మధ్య దూరం చాలా ఉండాలి. తగినంత దూరం పాటించకనే ప్రమాదాల తీవ్రత చాలా ఉంటోంది.
- రఘుకుమార్‌, వాహన తనిఖీ అధికారి, మహబూబ్‌నగర్‌


అనుభవం లేని డ్రైవర్లు వద్దు 

అనుభవం లేని వారిని డ్రైవర్లుగా నియమించుకోవద్దు. రహదారులపై వాహనాలు వాయు వేగంతో వెళుతుంటాయి. అవి ఎంత దూరంలో ఉన్నాయో, ఎంత సమయంలో సమీపిస్తాయో గుర్తించగలగాలి. కొత్తగా డ్రైవింగ్‌ చేసేవారు భయంతో ప్రమాదాలకు గురవుతున్నారు.
- శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ సీఐ మహబూబ్‌నగర్‌


కారణాలు ఇవే..

రోడ్డుపై అవగాహన లేక.. : రహదారులపై డ్రైవింగ్‌ చేసే వ్యక్తి రోడ్డు ఎత్తుగా ఉన్నా, పల్లంగా ఉన్నా గుర్తించాలి. గుంత, వంతెన, కూడలి, ఎక్కడ మీడియన్‌ గ్యాపులు, మలుపులు ముందే గమనిస్తుండాలి. ఇవి గమనించనప్పుడు వాహనాలు అదుపుతప్పుతున్నాయి.

చరవాణి మాట్లాడుతూ.. : చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపటం వల్ల ఏకాగ్రత ఉండటం లేదు. ఇలాంటి సమయంలో ముందున్న వాహనం ఒక్కసారిగా ఆగినా, అనూహ్యంగా ఏదైనా వాహనం వచ్చినా ఢీకొని తీవ్ర నష్టం సంభవిస్తోంది.

 నిద్ర మత్తులో.. : డ్రైవింగ్‌ చేసే వ్యక్తి తగినంత నిద్రపోకపోతే ప్రమాదమే. ప్రయాణం మధ్యలో ఆగుతూ ముఖం కడుక్కుని, టీ తాగుతూ, విశ్రాంతి తీసుకుంటూ వాహనాన్ని నడపాలి. దూర ప్రయాణాల్లో డ్రైవింగ్‌ చేసేవారు ఇద్దరు ఉండాలి. ఒక్కరే ఉంటే ఆగిపోవాలి. లేదంటే ఒక్క క్షణం నిద్రలోకి జారుకున్నా వాహనం పూర్తిగా అదుపు తప్పుతుంది.

 సీట్‌ బెల్ట్‌పై నిర్లక్ష్యం : చాలామంది సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం వల్ల ప్రమాద సమయంలో ఎగిరిపడి, ముందు సీట్లకు తాకి తీవ్రంగా గాయ పడుతున్నారు. ప్రతి ఒక్కరూ వాహనం ఎక్కిన తర్వాత సీటు బెల్ట్‌ ధరించాల్సిందే.
వేగంపై అదుపేదీ? : గంటకు 80 కి.మీ.ల కంటే మించిన వేగంగా డ్రైవింగ్‌ చేయొద్దు. ఈ వేగంతో ఉన్నప్పుడు వాహనాన్ని అదుపు చేయొచ్చు. ప్రమాదం జరిగినా నష్టం తీవ్రత తక్కువగా ఉంటుంది. 80 కి.మీ.ల వేగం దాటిందంటే వాహనం అదుపు చేయటం చాలా కష్టమవుతుంది.
సేఫ్టీ ఫీచర్స్‌ మరవొద్దు..  : సేఫ్టీ ఫీచర్స్‌ బాగున్న కార్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉన్నవి మైలేజీ ఇస్తున్నా రక్షణ మాత్రం తక్కువే. సేఫ్టీ రేటింగ్‌ ఎక్కువగా ఉన్న కార్లను ఎంచుకోవాలి. కారులో తప్పనిసరిగా ఎయిర్‌ బెలూన్లు ఏర్పాటు చేయించుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని