పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యం

భారతీయ జనతా పార్టీ(భాజపా) ఎంపీ టికెట్‌ కేటాయింపు అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కోసం అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో ఇద్దరి పేర్లే ప్రధానంగా తెరమీదకు వచ్చినట్ల్లు తెలుస్తోంది.

Updated : 28 Feb 2024 06:48 IST

భాజపా టికెట్లపై అధిష్ఠానం సమాలోచన

ఈటీవీ - ఆదిలాబాద్‌ : భారతీయ జనతా పార్టీ(భాజపా) ఎంపీ టికెట్‌ కేటాయింపు అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కోసం అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో ఇద్దరి పేర్లే ప్రధానంగా తెరమీదకు వచ్చినట్ల్లు తెలుస్తోంది. జిల్లాలోని భారాసకు చెందిన ఓ నేత పేరును ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యమివ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫలితంగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఇద్దరు నేతల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఈ నెల 19న భైంసా నుంచి ప్రారంభమైన విజయ సంకల్ప బస్సు యాత్ర ఈ నెల 29న నిజామాబాద్‌లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొనే బహిరంగ సభతో ముగియనుంది. ఈ బహిరంగ సభ పూర్తయ్యాకనే అభ్యర్థి ఎవరనే దానిపై ఆచితూచి అడుగువేయాలని పార్టీ భావిస్తోంది. ఎన్నికల సమయంలోనే పార్టీలోకి వచ్చే వారిని పరిగణనలోకి తీసుకుంటే ఏళ్లుగా పని చేసిన క్రియాశీలక నేతల నుంచి  ప్రతికూలాంశాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందనే దానిపై అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది. ఉన్న వారిని సిద్ధాంతపరంగా తయారు చేసుకుంటే ఆశించిన ఫలితాలను రాబట్టుకోవాలనే అభిప్రాయం జాతీయస్థాయిలోని ఒకరిద్దరు నేతలు వెలిబుచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

మూడు సర్వేలు?

అధిష్ఠానం ఇప్పటికే మూడు సర్వేలు నిర్వహించింది. అయిదారుగురు అభ్యర్థుల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి అమిత్‌షా తరఫున ఒకటి, రాష్ట్ర పార్టీ తరఫున మరొకటి వీటికి సంబంధం లేకుండా మరో ప్రత్యేక సర్వేను మొత్తం మూడు సర్వేలు చేసింది. వీటిలో ఇద్దరు నేతల మధ్యనే నువ్వా-నేనా అన్నట్లుగా తెరమీదకు వచ్చింది. పార్టీ ఆ ఇద్దరు నేతలతోనూ వేర్వేరుగా సంప్రదింపులు సైతం చేస్తోంది. జిల్లా నుంచి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలను సైతం ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. పార్టీ మొదలు - వ్యక్తిగత ఇష్టాయిష్టాలు తరువాత అన్నట్లు సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బూత్‌ కమిటీల వారీగా క్రియాశీలక కార్యకర్తల బలాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. సిఫారసు చేసిన నేతలను పరిగణనలోకి తీసుకుంటే గ్రూపులను పోషించినట్లవుతుందని భావిస్తోంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఎవరెన్ని సిఫారసులు చేసినా అధిష్ఠానం నిర్ణయించిన వారికే టికెట్లు ఇచ్చిన విధానాన్ని నేతలకు గుర్తు చేయడం గమనార్హం.


ఏ-ప్లస్‌

గత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన నాలుగు స్థానాలను మళ్లీ కైవసం చేసుకోవాలనే ప్రణాళికతో భాజపా వ్యూహరచన చేస్తోంది. ఇందులో మిగిలిన మూడు స్థానాలతో పోల్చితే ఆదిలాబాద్‌ స్థానం ఏ-ప్లస్‌గా పార్టీ భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేల విజయంతో అది మరోసారి నిరూపితమైందని శ్రేణులకు నిర్దేశిస్తోంది. 2019 పార్లమెంటు ఎన్నికల కంటే ముందు మండలానికి కొందరు క్రియాశీలక కార్యకర్తలుంటే ప్రస్తుతం గ్రామగ్రామానికి పార్టీ విస్తరించిందని తెలియజేస్తోంది. రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా స్వయంగా అధిష్ఠానం ఆ పార్టీకి చెందిన జాతీయస్థాయి కీలక నేతల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. టికెట్‌ ప్రాతిపదికన కాకుండా మోదీ విజన్‌ పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావంతులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తెచ్చే పనిలో ఉంది. టికెట్టే ప్రామాణికమనుకునే వారిని పరిగణనలోకి తీసుకోవద్దని భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని